బంజారాల ఆరాద్య దైవం సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని లంబాడా సోదర, సోదరీమణులకు జిల్లా అదనపు కలెక్టర్ రమేష్ శుభాకాంక్షలు తెలిపారు.
స్థానిక ద్వారక మీరా కాలనీ,నర్సాపూర్ రోడ్డు (ప్రభుత్వం బంజారా భవనం కోసం కేటాయించిన స్థలం ) లో ఏర్పాటు చేసిన జయంతి ఉత్సవల్లో ముఖ్య అతిథిగా ప్రత్యేక పూజలలో జిల్లా అదనపు కలెక్టర్ రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ రమేష్ మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ గొప్ప సంఘసంస్కరణ వాది అని, తన అద్వితీయ బోధనలతో బంజారాలను సన్మార్గంలో పయనింప జేసిన మహానుభావుడని కొనియాడారు. ఆధ్యాత్మిక మార్గంలోనే కాకుండా బంజారాల హక్కుల కోసం నిజాం, మైసూర్ పాలకులకు వ్యతిరేకంగా 18 వ శతాబ్దంలో సాగిన పోరాటంలో సేవాలాల్ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు.
లిపిలేని బంజారాల భాషకు ఒక రీతిని సమకూర్చింది సేవాలాల్ మహారాజేనని,ఆచార వ్యవహారాలు కట్టుబాట్లు విలక్షణమైన దుస్తులు ఆభరణాలతో లంబాడాలు తమ సంస్కృతిని కాపాడుకున్నారంటే సేవాలాల్ మహారాజ్ కృషి ఫలితమేనని తెలిపారు.
హింస పాపమని మత్తు ధూమపానం శాపమని హితవు పలికి బంజారా జాతికే కాదు యావత్ సమాజానికి ఆదర్శ పురుషుడిగా సేవాలాల్ మహరాజ్ నిలిచారని కొనియాడారు. బంజారా సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు మైనంపల్లి హన్మంతరావు, జిల్లా మైన్స్ అధికారి జయరాజు, ఎస్ సి & ఎస్ ఎస్టీ అభివృద్ది శాఖ అధికారి విజయ లక్ష్మి, మెదక్ తహసీల్దార్ శ్రీనివాస్ , తదితరులు పాల్గొన్నారు.
