అధిక వర్షాల నేపథ్యంలో ఉద్యాన రైతులు జాగ్రత్తలు పాటించాలి

 

జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి కె.అనిత

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 04 : ప్రస్తుతం నెలకొన్న భారీ వర్షాల నేపథ్యంలో ఉద్యాన పంటలు సాగు చేసే రైతులు జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఉద్యానవన,పట్టు పరిశ్రమ శాఖ అధికారి కె.అనిత ఒక ప్రకటనలో తెలిపారు.గత వారం రోజుల నుండి ఎడతెరపి లేకుండా కురుస్తున్నవర్షాల కారణంగా ఉద్యాన పంటలు దెబ్బతినకుండా రైతులు మెళకువలు పాటించాలని తెలిపారు. పొలంలో నిలిచిన నీటిని
తీసివేసినట్లయితే పంటను కాపాడుకోవచ్చని తెలిపారు.దెబ్బతిన్న మొక్కలు,వేరు మూల వ్యవస్థ కారణంగా మొక్కలు
కోలుకోవడానికి పోషకాలను క్రమంగా ఎరువులతో భర్తీ చేయాలని,తెగుళ్ళు, పురుగుల ఉధృతిని గుర్తించి నివారణకు చర్యలు తీసుకోవాలని, ఆరోగ్యకరమైన మేరు వ్యవస్థ పునః రుద్దరణకు కరిగే మేజర్,ట్రేస్ ఎలిమింట్స్ వినియోగించాలని తెలిపారు.ఉద్యానవన పంటల సాగులో భాగంగా నిలువ ఉన్న అదనపు నీటిని బయటకు పంపించాలని,మొక్కలు బలంగా పెరిగేందుకు. పోషకాల మోతాదులు పెంచాలని,వ్యాధికారక శిలీంధ్రాలు,చీడల నివారణ చర్యలు చేపట్టాలని,లేత తోటల్లో చనిపోయిన
మొక్కలను తిరిగి నాటుకోవాలని,నేలను వెంటనే సాగు చేసినట్లయితే చెట్లను లేపి మొదళ్ళ వద్దకు మట్టి సర్దుబాటు చేయాలని
తెలిపారు.కూరగాయల సాగు చేసే రైతులు పడిపోయిన మొక్కలను నిలబెట్టి మట్టిని సర్దాలని, 0.3% 13-0-45(నీటిలో కరిగే ఎరువు మల్టి-కె) / 2% యూరియా ద్రావణాన్ని 2-3 సార్లు వారం రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలని,క్రొత్తగా
విత్తినట్లయితే వాటిని తీసివేసి మళ్ళీ నాటుకోవాలని,పంటకు ఆకుమచ్చ,కాయకుళ్ళు, బూజు తెగుళ్ళు ఉన్నట్లయితే లీటరు నీటికి 2.5 గ్రా॥ సాఫ్ మందును కిలిపి 2 సార్లు పిచికారీ చేయాలని,వేరుకుళ్ళు వచ్చినట్లయితే కాపర్ ఆక్సీ క్లోరైడ్ 30 గ్రా॥/కర్బండిజమ్ 10 గ్రా॥ల చొప్పున 10 లీటర్ల నీటిలో కలిపిన ద్రావణాన్ని మొక్కల మొదళ్ళలో పోయాలని తెలిపారు. మిరప పంట సాగు చేసే రైతులు మొక్కలు వెంటనే తేరుకోవడానికి లీటర్ నీటికి 10 గ్రా॥ యూరియా,10 గ్రా॥ పంచదార కలిపిన
ద్రావణాన్ని వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలని,మొక్కలు వడబడి,తలలు వాలిస్తే లీటర్ నీటికి 5 గ్రా॥ల మెగ్నీషియమ్ సల్ఫేట్,కాపుతో ఉండి, ఇనుప ధాతు లోపంతో పాలిపోతే10 లీటర్ల నీటికి 50 గ్రా॥ల అన్నబేధితో పాటు ఒకనిమ్మ చెక్క రసం కలిపి పిచికారీ చేయాలని,నేల ఆరిన తరువాత ఎకరానికి 30 కిలోల యూరియా,15 కిలోల పొటాష్,200 కిలోల వేపపిండి వేయాలని, పంటను బ్యాక్టీరియా ఆకుపచ్చ,కానోఫారా వంటి తెగుళ్ళు ఆశించే అవకాశం ఉన్నందునముందు జాగ్రత్త చర్యగా 10 లీటర్ల నీటికి 30 గ్రా॥ కాపర్ ఆక్సీకోరైడ్,1 గ్రా॥ స్ట్రెప్టోసైక్లిన్ మందులను కలిపి ద్రావణాన్ని పిచికారీ చేయాలని,పంటను ఆశించే వివిధ రకాల గొంగళి పురుగుల నివారణకు క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ./అసిఫేట్ 1.5గ్రా॥/ హనొవాల్యురాన్ 0.75 మి.లీ. వంటి కీటక నాశిని మందులను పిచికారీ చేయాలని తెలిపారు. పూల తోటల పెంపకంలో మొక్కలపై 2% యూరియా/1%13-0-45 (నీటిలో కరిగే ఎరువు మల్టి-కె)ను 2-3 సార్లు పిచికారీ చేయాలని,
ఆకుమచ్చ తెగులు నివారణకు ప్రొపికొనజోల్ 1 మి.లీ. ఒక లీటర్ నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో 1-2 సార్లు పిచికారీ చేయాలని తెలిపారు. రైతులు ఉద్యానవన పంటల పునరుద్దరణకు తగు చర్యలు తీసుకొని పంటలు కాపాడుకొని అధిక దిగుబడి సాధించి లబ్ది పొందాలని ఆకాంక్షించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking