ఎడ్యుకేషన్ కన్వీనర్,పీసీబీ సీనియర్ శాస్త్రవేత్త డబ్ల్యూజీ ప్రసన్న కుమార్
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 18 : పర్యావరణ పరిరక్షణతోనే మానవ మనుగడ సాధ్యమని జాతీయ పర్యావరణ విద్యా సమన్వయకర్త, తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సీనియర్ శాస్త్రవేత్త, డాక్టర్ డబ్ల్యూ జీ ప్రసన్న కుమార్ అన్నారు.సోమవారం లక్షెట్టిపేట పట్టణంలోని ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో ‘నీటి జాడ,దాని వినియోగం-ప్లాస్టిక్ వినియోగ నివారణ’అనే అంశం పై తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సహకారంతో సమీకృత ఉపాధ్యాయ విద్యా విభాగం (ఐటీఈపీ)ఆధ్వర్యంలో జాతీయ సెమినార్ ను నిర్వహించారు.ఈ సందర్భంగా శాస్త్రవేత్త డాక్టర్ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ… నిత్య జీవితంలో మనకు తెలియకుండానే ఈ ప్రకృతి ఎన్నో సహజ జీవన మార్గాలను ఏర్పాటు చేసిందన్నారు. మానవుడు సహజ వనరులను కలుషితం చేసుకుంటూ తన మనుగడకు తానే ప్రశ్నార్థకంగా మారుతున్నడన్నారు. అవసరమైన దాని కంటే అధిక వినియోగం లేదా పర్యావరణాన్ని కాలుష్యం చేసే చర్యలు నేటి సమాజంలో అలవాటుగా మారుతున్నాయని పలు ఉదాహరణలతో వివరించారు. రాష్ట్ర కాలుష్య నివారణ, నియంత్రణ చట్టం 1974 ప్రకారం,ప్రతి ఒక్కరూ నీటి వినియోగం గురించి అవగాహన కలిగి ఉండాలన్నారు.ఒక కప్పు కాఫీ తయారీకి 160 లీటర్స్, ఒక కంచి పట్టు చీర తయారీకి 30 వేల లీటర్స్ నీరు శాస్త్రీయంగా వినియోగం అవుతాయని విద్యార్థులకు వివరించారు. నీటిని పొదుపుగా వాడకపోతే, భవిష్యత్ లో నీటి కోసం దేశాల మధ్య యుద్ధాలు జరిగే పరిస్థితులు వస్తాయన్నారు. అదే విధంగా ఒకసారి వాడిన ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించాలని పిలుపునిచ్చారు.ప్లాస్టిక్ భూతంతో ప్రాణగండం తప్పదని ఆవేదన వ్యక్తం చేశారు.తల్లి పాలు మొదలుకుని అన్నింటిలో నేడు ప్లాస్టిక్ ఉంటుందని ఉదాహరణలతో వివరించారు. అంతకుముందు నేషనల్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ అకాడమిక్ నెట్వర్క్ అధ్యాపకురాలు పద్మ మాట్లాడుతూ…విద్యార్థులకు సమీకృత ఉపాధ్యాయ జాతీయ విద్యా విధానంలో టీచింగ్ కరిక్యులం ఎంతో ముఖ్యమైనదన్నారు. ఉపాధ్యాయ వృత్తిలో టీచింగ్ ప్లాన్ తోనే అనుకున్న స్థాయిలో ఫలితాలు రాబట్టవచ్చన్నారు. అదే విధంగా విద్యార్థులు పర్యావరణ పరిరక్షణ పై అవగాహన పెంచుకోవాలని సూచించారు.అంతకుముందు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జై కిషన్ ఓజా మాట్లాడుతూ… అందరూ పర్యావరణ చట్టాలపై అవగాహన పెంచుకుంటే కాలుష్యాన్ని నియంత్రించవచ్చన్నారు. అంతకుముందు ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం సమన్వయ కర్త డాక్టర్ పడాల తిరుపతి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నటువంటి ఒకే ఒక మన లక్షెట్టిపేట ఐటీఈపీ కాలేజీ కి జాతీయ సెమినార్ అవకాశం దక్కడం ఎంతో గర్వకారణమని కొనియాడారు.ప్రతి విద్యార్థి సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి తాము ప్రత్యేక శ్రద్ధతో కృషి చేస్తున్నట్లు వివరించారు.నీటి సద్వినియోగం,ప్లాస్టిక్ రహిత సమాజ స్థాపనకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం ముఖ్య అతిధులను శాలువా,పూలమాలలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ టీ గంగయ్య, అధ్యాపకులు,బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.