– ఎలాంటి హాని తలపెట్టకుండా బేషరతుగా వదిలివేయాలి
– ప్రశ్నించే ఉద్యమకారులను అణిచివేసే కుట్రలో భాగమే అక్రమ అరెస్టులు
– జవహర్ నగర్ ప్రజా సమస్యల సాధన కమిటి
మేడ్చల్ మార్చ్ 20 (:దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం(పీడీఎం) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు చంద్రమౌళి, అతని కుమారుడు ప్రుద్వీరాజును ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ములుగు పోలీసుల అక్రమ అరెస్టుకు గురిచేయడాన్ని జవహర్ నగర్ ప్రజా సమస్యల సాధన కమిటీలోని బాగస్వామ్య సంస్థలు తీవ్రంగా ఖండించారు. మాసోమవారం రోజు ఉదయం సుమారు 11 గంటల సమయంలో మేడ్చల్ జిల్లా, కాప్రా మండలం, జవహర్ నగర్ మున్సిపల్ కార్పోరేషన్, బాలాజీనగరులో నివాసం ఉంటున్న చంద్రమౌళిని, మూడవ సంవత్సర న్యాయవాద విద్యను అభ్యాసిస్తున్న అతని కుమారుడు ప్రుద్వీరాజును కుటుంబంలోని సభ్యులకు ఎలాంటి కారణాలు తెలపకుండా, తీవ్ర భయాందోళనకు గురిచేసేలా ప్రవర్తించిన తెలంగాణ కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వ పోలీసుల దుర్మార్గమైన అప్రజాస్వామిక చర్యలు అమానుషమని దుయ్యబట్టారు. ప్రజాస్వామ పద్దతిలో ప్రజల మౌలిక సమస్యల పరిష్కారానికి పోరాడుతున్న ప్రశ్నించే ఉద్యమ కారులను అణిచివేతకు గురిచేసే కుట్రలో బాగమే ములుగు పోలీసుల చర్య అని స్పష్టం చేశారు. ఇప్పటికైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు అక్రమంగా అరెస్టుకు గురిచేసిన చంద్రమౌళిని, అతని కుమారుడు ప్రుద్వీరాజును బేషరతుగా వదలివేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల ప్రజా ఆగ్రహాన్ని చవిచూడవలసి ఉంటుందని జవహర్ నగర్ ప్రజా సమస్యల సాధన కమిటీ లోని బాగస్వామ్య సంస్థలకు చెందిన సిపిఐ(ఎం.ఎల్) ప్రతిఘటన కేంద్ర కమిటీ కార్యదర్శి షేక్ షావలి, సీపిఐ(ఎం.ఎల్) ప్రజాపంథా మేడ్చల్ జిల్లా కార్యదర్శి వి.ప్రవీణ్ కుమార్, ఐ.ఎఫ్.టీ.యు. రాష్ట్ర సహాయ కార్యదర్శి పి. శివబాబు, ముస్లీం వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ అధ్యక్షులు ఎం.డి.పాషామియా, ఏ.ఐ.ఎఫ్.టీ.యు. వై.మల్లేష్, పీఓఢబ్ల్యూ(విముక్తి) ఎం.పుణ్యవతి, టివిఐవి వ్యవస్థాపక అధ్యక్షులు మభ్భు బాలు, స్పూర్తి భవన నిర్మాణ సంఘం కుమార్ తదితరులు హెచ్చరించారు. ఈ సందర్భంగా భయాందోళనలకు గురౌతున్న చంద్రమౌళి కుటుంబ సభ్యులైన తల్లి ఘనపురం అనసూయ, సతీమణి సూర్యకళను పరామర్షించి జరిగిన సంఘటనపై వివరాలు తెలుసుకొన్నారు. అనంతరం స్థానిక అంబేద్కర్, బాబు జగ్జీవన్ రాం విగ్రహాల ముందు ప్లే కార్డులతో నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు.