కూకట్పల్లి ( ప్రజాబలం ప్రతినిధి ) డిసెంబర్ 28 కుకట్‌పల్లి అల్ల్విన్ కాలనీ, ఫేజ్-2 పరిధిలోని సర్వే నెం.336 ప్రభుత్వ భూమిపై గత మూడు నెలలుగా సాగుతున్న అక్రమ నిర్మాణాలు రెవెన్యూ శాఖ పనితీరుపై తీవ్ర అనుమానాలను కలిగిస్తున్నాయి. ఎలాంటి చట్టబద్ధ అనుమతులు లేకుండా గుర్తు తెలియని వ్యక్తి అక్కడ అక్రమంగా షెడ్ నిర్మాణం చేపట్టడం స్థానికులను ఆందోళనకు గురి చేస్తోంది.నిర్మాణం చేస్తున్న వ్యక్తిని కాలనీ వాసులు ప్రశ్నించగా, అది చర్చ్ నిర్మాణం కోసం అని చెప్పినట్లు సమాచారం. అయితే అదే స్థలంలో ఇప్పటికే 40 సంవత్సరాలుగా చర్చ్ ఉన్నప్పటికీ, మరో నిర్మాణం ఎందుకు చేపడుతున్నారన్న ప్రశ్నకు అతడు స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోయాడు.ఈ వ్యవహారంపై స్థానికులు కుకట్‌పల్లి ఎం ఆర్ ఓ కి ఫిర్యాదు చేయగా, చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. దీనిపై రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ అగస్టిన్ పోలీసులతో కలిసి జే సి బి తో సంఘటనా స్థలానికి చేరుకుని నిర్మాణాన్ని తాత్కాలికంగా నిలిపివేసి, అక్రమ షెడ్‌ను తొలగించాలని ఆదేశిస్తూ కొంత గడువు ఇచ్చినట్లు స్థానికులు తెలిపారు.కానీ ఆ గడువు అక్రమాన్ని అరికట్టడానికి కాకుండా, నిర్మాణాన్ని పూర్తిచేసుకునేందుకు ఉపయోగపడిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారికంగా ‘స్టాప్’ అన్నట్టే కనిపించినా, ఆచరణలో మాత్రం ప్రభుత్వ భూమిపై అక్రమ షెడ్ పూర్తి కావడం రెవెన్యూ శాఖ నాటకాన్ని బట్టబయలు చేస్తోందని స్థానికులు విమర్శిస్తున్నారు.
ప్రభుత్వ భూమిని రక్షించాల్సిన బాధ్యత ఉన్న అధికారుల మౌనం అనేక అనుమానాలకు తావిస్తోందని కాలనీ వాసులు పేర్కొంటున్నారు. అక్రమ నిర్మాణాన్ని వెంటనే తొలగించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ఉన్నతాధికారులను ఆశ్రయించడంతో పాటు న్యాయపోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరిస్తున్నారు.
