♦️ తూర్పు వరంగల్ జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనంలో కొండ మురళీధర్ రావు…
వరంగల్ ప్రతినిధి ఫిబ్రవరి 13 ( ప్రజాబలం) : ఇచ్చిన మాటను ఎలానైనా నిలబెట్టుకునే వ్యక్తి కొండ మురళి అనే విషయం వరంగల్ తూర్పు వర్కింగ్ జర్నలిస్టు మిత్రులందరికీ తెలిసిన విషయమేనని కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్ రావు అన్నారు.
వరంగల్ తూర్పు వర్కింగ్ జర్నలిస్టుల తో సోమవారం రత్న హోటల్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆయన విలేకరులతో కలిసి ముచ్చటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొండ మురళి, సురేఖల వ్యక్తిత్వాలు మాట ఇస్తే నిలబెట్టుకోనే విషయం లో ఎక్కడికైనా వెళ్తారనే విషయం ప్రతి మీడియా మిత్రులకు తెలుసునని ఉద్ఘటించారు. తాను ఎమ్మెల్సీగా, సురేఖ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో వరంగల్ తూర్పు వర్కింగ్ జర్నలిస్టుల కోసం కూరగాయల మార్కెట్ వద్ద స్థలాన్ని సేకరించి భవనాన్ని నిర్మించిన విషయాన్ని సందర్భంగా గుర్తు చేశారు. పనిచేస్తున్న ప్రతి ఒక్క జర్నలిస్టులు తమ వారేనని తన దృష్టికి తీసుకువచ్చిన జర్నలిస్టుల సమస్యల పరిష్కరానికి పని చేస్తానని అన్నారు. తూర్పు వర్కింగ్ జర్నలిస్టుల కోసం మరో భవనంతో పాటు ప్రతి ఒక్క జర్నలిస్టుకు ఇంటి స్థలాలను కేటాయించే విధంగా సాయిబాబా సాక్షిగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు అందరూ జర్నలిస్టు మిత్రులు తమకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు వేముల నాగరాజు, సదయ్య, మాజీ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గడ్డం కేశవమూర్తి, వరంగల్ తూర్పు జర్నలిస్టుల పరపతి సంఘం అధ్యక్షుడు కోరుకొప్పుల నరేందర్, వరంగల్ తూర్పు జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు జక్కుల విజయ్, ప్రధాన కార్యదర్శి రాజేంద్రప్రసాద్, ఐజేయు రాష్ట్ర నాయకులు గాడేపల్లి మధు, యాస్మాని శ్రీనివాస్, గుల్షన్, కాంగ్రెస్ నాయకులు తోటకూరి సదానందం తదితరులు పాల్గొన్నారు.