అమాయక మధ్య తరగతి ప్రజలే టార్గెట్
మార్కెట్ చిరు వ్యాపారులే లక్ష్యంగా చలామణి
గతంలో కలకలం రేపిన సంఘటనలు
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 26 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పట్టణంలో దొంగ కరెన్సీ నోట్లు మళ్ళీ ప్రత్యక్షం అయ్యాయి. పలువురు కూలీలు,పేద,మధ్య తరగతి ప్రజలను టార్గెట్ గా చేసుకొని దొంగనోట్లు చలామణి చేస్తున్నట్లు సమాచారం.అలా వచ్చిన నోట్లు చిరువ్యాపారుల వద్దకు వచ్చిన కూడా వారు గుర్తించక నష్టపోతున్నట్లు వాపోతున్నారు. కొంతమంది వ్యాపారులు గుర్తించి తిరస్కరిస్తున్నారు.గతంలో రైతులను మోసగించిన పట్టణానికి చెందిన ఓ పత్తి వ్యాపారి నకిలీ నోట్ల వ్యవహారం జిల్లాలో సంచలనంగా మారింది. పట్టణంలోని గోదావరి రోడ్ కు చెందిన ఓ యువ నాయకుడు సైతం దొంగ నోట్ల చలామణి లో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్నాడు. తాజాగా మంగళవారం పట్టణంలోని ఓ చిరు వ్యాపారి నిత్యావసర సరుకులు విక్రయించే క్రమంలో ఓ గ్రామానికి చెందిన వ్యక్తి కి నకిలీ వంద రూపాయల నోటు వచ్చింది. దీంతో ఆ గ్రామస్తుడు ఎవరికీ చెప్పుకోవాలో తెలియక దొంగ నోటు వ్యవహారం తిరిగి తనకే ఇబ్బందిగా మారుతుందని భావించి మౌనంగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.అదే విధంగా బుధవారం బస్టాండ్ రోడ్డు వద్ద ఓ వ్యాపారి వద్దకు రెండు వందల రూపాయల నోట్లు రావడంతో అవి గుర్తించి తిరస్కరించినట్లు తెలుస్తోంది.అలాగే చాలా మంది కూలీలు,ఇతర చిరువ్యాపారుల్లో ఈ నోట్లు మారుతుండటంతో అవి మార్కెట్లోకి చలామణి అవుతున్నాయి.ఇవి దొంగ నోట్లని తెలయక ప్రజలు మోసపోతున్నారు. ఒరిజినల్ నోటుకు దొంగ నోటుకు పెద్దగా తారతమ్యం లేకపోవడంతో సామాన్య ప్రజలు అసలు నోటు ను గుర్తించడం లేదు.చాలా మంది చివరకు బ్యాంకుల్లో అధికారులు తిరస్కరిస్తున్నారని వాపోతున్నారు.ఇప్పటికైన అధికారులు స్పందించి దొంగ నోట్లు చలామణి చేస్తున్న వ్యక్తులను గుర్తించేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.