విజయభేరి బహిరంగసభలో సోనియాగాంధీ సమక్షంలో కాంగ్రెస్లోకి తుమ్మల

 

ఖమ్మం ప్రతినిధి సెప్టెంబర్ 15 (ప్రజాబలం) ఖమ్మం మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముహూర్తం ఫిక్స్ అయింది. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సమక్షంలో ఎల్లుండి ఆయన లాంఛనంగా పార్టీలో చేరనున్నారు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు ముగిసిన మరుసటి రోజున తుక్కుగూడలో నిర్వహించే విజయభేరి బహిరంగసభలో పార్టీ కండువా కప్పుకో బోతున్నట్లు ఆయన సన్నిహితులు, పీసీసీ నేతలు సూచనప్రాయంగా తెలిపారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావ్ థాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, పార్టీ ప్రచార కమిటీ కో-చైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి తదితరులు హైదరాబాద్ మాదాపూర్ లోని ఆయన నివాసానికి ఇవాళ ఉదయం వెళ్లి పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించారు. దీనికి తుమ్మల సానుకూలంగా స్పందించి విజయభేరి సభా వేదికగా చేర నున్నట్లు హామీ ఇచ్చినట్లు తెలిసింది.

 

ఖమ్మం,పాలేరు… పోటీ ఎక్కడి నుంచి?

తుమ్మల నాగేశ్వరరావు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఖమ్మం జిల్లాలో మొత్తం పది నియోజకవర్గాలు ఉన్నప్పటికీ అందులో మూడు మాత్రమే జనరల్ సీట్లు. గతంలో పాలేరు నుంచి ప్రాతినిధ్యం వహించినందున ఈసారి కూడా అక్కడి నుంచే పోటీ చేయాలని అనుకుంటున్నారు. కాంగ్రెస్ తరపున పోటీలోకి దిగనున్నందున అక్కడి స్థానిక లీడర్లు, జిల్లా నేతల అభిప్రాయాలను తెలుసుకొని అధిష్టానం స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. పాలేరులో బీఆర్ఎస్ తరపున రెడ్డి సామాజికవర్గానికి చెందిన అభ్యర్థి బరిలో ఉన్నందున అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బరిలోకి దించి, ఖమ్మంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన పువ్వాడ అజయ్ పోటీ చేస్తున్నందున దానికి గట్టి పోటీ ఇచ్చేలా అదే కమ్యూనిటీకి చెందిన తుమ్మలను రంగంలోకి దించాలన్నది కాంగ్రెస్ వ్యూహంగా తెలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking