ఖమ్మం ప్రతినిధి సెప్టెంబర్ 15 (ప్రజాబలం) హైదరాబాద్ లోని ప్రగతి భవన్ నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు, రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి తన్నీరు హరీశ్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్రంలో 9 నూతన వైద్య కళాశాలలను వర్చువల్ పద్దతిలో ప్రారంభించారు. నూతన వైద్య కళాశాలల్లో ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాల ఉండగా, ఖమ్మం వైద్య కళాశాల లెక్చర్ హాల్ నుండి మంత్రి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఒకేరోజు 9 ప్రభుత్వ నూతన మెడికల్ కళాశాలలలో తరగతులు ప్రారంభించి ముఖ్యమంత్రి కెసిఆర్ తన మార్కును చూపించారన్నారు. రాష్ట్రంలోని ఖమ్మం, కరీంనగర్, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగామ, కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో మెడికల్ కళాశాలలలో తరగతులను సీఎం కేసీఆర్ ప్రారంభించారని ఆయన అన్నారు. మెడికల్ కళాశాలల ఏర్పాటుతో జిల్లాలో కలిగే ప్రయోజనాలను, మెడికల్ కళాశాలలకు అనుబంధంగా ఉండే హాస్పిటల్లో అందే వైద్య సేవలను ప్రజలకు తెలియజేయాలని కోరారు. మెడికల్ కళాశాల భవనాలు నిర్మాణం కోసం ఇప్పటికే ప్రభుత్వం రూ.166 కోట్లు మంజూరు చేసిందని మంత్రి తెలిపారు. పాత కలెక్టరేట్, పౌరసరఫరాలు, ఈవిఎం గోడౌన్, గిరిజనాభివృద్ది, రోడ్లు భవనాల శాఖల భవనాలను రెన్నోవేషన్ చేపట్టి, రూ. 8.5 కోట్లతో పరిపాలన, లైబ్రరీ, పరీక్షలు, టీచింగ్ హాళ్లు, మ్యూజియం, బయో కెమిస్ట్రీ, క్లినికల్ ఫిజియాలజీ, హేమటాలజీ, అంఫిబియా ల్యాబ్ లు, డిసిక్షన్ హాల్, లెక్చర్ హాళ్లు, బయో కెమిస్ట్రీ, అనాటమి శాఖల అధికారులు, సిబ్బంది కార్యాలయం, బాలికల హాస్టళ్లుగా అద్భుతంగా సకల సౌకర్యాలతో తీర్చిదిద్దామన్నారు. గతంలో రాష్ట్రంలో కేవలం 3 మెడికల్ కాలేజీలు ఉంటే, నేడు తెలంగాణ లో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 26 వైద్య కళాశాలలను సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఏర్పాటు చేసుకున్నామన్నరు. ఏటా 10 వేల మంది విద్యార్థులు చదువులు సాగిస్తున్నారని, రానున్న రోజుల్లో
తెలంగాణ వైద్య రంగానికి వేదికగా నిలువనుందన్నారు. ప్రైవేటు మెడికల్ కళాశాలకు ధీటుగా ప్రభుత్వ వైద్య కళాశాలలో సదుపాయాల కల్పన చేయడం జరిగిందని మంత్రి వివరించారు. విద్యార్థులు తమ కోర్స్ ను పట్టుదల, అంకితభావంతో పూర్తి చేసి తల్లిదండ్రుల కల నెరవేర్చి, జీవితంలో ఉన్నత స్థానాలకు చేరాలని ఆయన ఆకాంక్షించారు. వైద్యులను ప్రజలు దేవునిలో పోలుస్తారని, విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తరువాత భాద్యతగా ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని కోరారు.
ఈ సందర్భంగా వైద్య విద్యలో చేరిన తొలి బ్యాచ్ విద్యార్థులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ కళాశాల మంజూరు చేసి ప్రారంభించిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఅర్ కి జిల్లా ప్రజల తరుపున మంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జెడ్పి చైర్మన్ లింగాల కమలరాజ్, రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎస్. రాజేశ్వరరావు, జిల్లా వైద్య ఆరోగ్య అధికారిణి డా. బి. మాలతి, జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. వెంకటేశ్వర్లు, కార్పొరేటర్ కర్నాటి కృష్ణ, కళాశాల ప్రొఫెసర్లు, అసోసిసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, టీఎస్ఎంఐడిసి ఇఇ ఉమామహేశ్వరరావు, డిఇ శ్రీనివాస్, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.