మహిళల ఆర్థిక అభివృద్ధి కొరకు ఇందిరా మహిళా శక్తి పథకం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి నవంబర్ 19 : మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.మంగళవారం జిల్లాలోని లక్షెట్టిపేట మండలం గుల్లకోట గ్రామంలో ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా లక్ష్మిప్రసన్న గ్రామసంఘం ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ఏర్పాటు చేసి నిర్వహిస్తున్న పెరటి కోళ్ళ మదర్ యూనిట్ను జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, హాజీపూర్ తహశిల్దార్ శ్రీనివాస్ రావు దేశ్పాండేతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… మహిళలు ఆర్థిక స్వావలంబన పొందేందుకు ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ప్రోత్సహిస్తుందని తెలిపారు.క్యాంటన్లు, మీ-సేవ కేంద్రాలు,డైరీ ఫామ్,పెరటి కోళ్ళ పెంపకం,కోళ్ళ ఫామ్ ఏర్పాటుతో పాటు అనేక అంశాల ద్వారా అవకాశం కల్పించడం జరుగుతుందని తెలిపారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు ప్రభుత్వం అందిస్తున్న అవకాశాన్ని వినియోగించుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని తెలిపారు.
అనంతరం మండలంలోని గుల్లకోట, బలరావుపేట,జెండా వెంకటాపూర్ గ్రామాలలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసి మద్దతు ధర చెల్లిస్తుందని, సన్నరకం వడ్లకు మద్దతు ధరతో పాటు అదనంగా 500 రూపాయల బోనస్ ఇవ్వడం జరుగుతుందని,ఈ నేపథ్యంలో సన్నరకం, దొడ్డురకం వడ్లను వేర్వేరుగా కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు.క్వింటాల్ ఏ గ్రేడ్ రకానికి 2 వేల 320 రూపాయలు, సాధారణ రకానికి 2 వేల 300 రూపాయలు చెల్లించడం జరుగుతుందని, రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే సమయంలో నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, కొనుగోలు కేంద్రాలలో రైతుల సౌకర్యార్థం మౌళిక వసతులు కల్పించడం జరిగిందని,కొనుగోలు కేంద్రాలలో తూకం, తేమ యంత్రాలు, త్రాగునీరు,నీడ,గన్ని సంచులు,టార్పాలిన్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking