ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి నవంబర్ 19 : ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు నివాస ప్రాంతాలు, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడంతో వ్యాధులను దూరంగా ఉంచవచ్చని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం మరుగుదొడ్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలోని హాజీపూర్ మండల తహశిల్దార్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, తహశిల్దార్ శ్రీనివాసరావు దేశ్పాండేతో కలిసి హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్డి తప్పనిసరిగా ఉండాలని,వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతో వ్యాధులు దరి చేరకుండా ఆరోగ్యంగా ఉండవచ్చని తెలిపారు.ప్రభుత్వం పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని, గ్రామపంచాయతీలు, పురపాలక సంఘాలలో అధికారులు, సిబ్బంది సమన్వయంతో పారిశుద్ధ్యంపై ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.ఈ సందర్భంగా లబ్దిదారులకు మంజూరైన ప్రొసీడింగ్ను అందజేశారు. అనంతరం హాజీపూర్ మండల కేంద్రం, కర్ణమామిడి గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసి మద్దతు ధర చెల్లిస్తుందని, సన్నరకం వడ్లకు మద్దతు ధరతో పాటు అదనంగా 500 రూపాయల బోనస్ ఇవ్వడం జరుగుతుందని,ఈ నేపథ్యంలో సన్నరకం, దొడ్డురకం వడ్లను వేర్వేరుగా కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. క్వింటాల్ ఏ గ్రేడ్ రకానికి 2 వేల 320 రూపాయలు, సాధారణ రకానికి 2 వేల 300 రూపాయలు చెల్లించడం జరుగుతుందని, రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే సమయంలో నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, కొనుగోలు కేంద్రాలలో రైతుల సౌకర్యార్థం మౌళిక వసతులు కల్పించడం జరిగిందని,కొనుగోలు కేంద్రాలలో తూకం, తేమ యంత్రాలు, త్రాగునీరు,నీడ,గన్ని సంచులు, టార్పాలిన్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రసాద్,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.