ఖమ్మం ప్రతినిధి మార్చి 21 (ప్రజాబలం) ఖమ్మం ఓటర్లకు, పోలింగ్ సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలింగ్ కేంద్రాల్లో అన్ని మౌళిక వసతుల కల్పన చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. గురువారం కలెక్టర్ ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలోని కస్బా బజార్, సుందరయ్య నగర్, ఖాజీపుర, శాంతినగర్ ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలు సందర్శించి, పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలింగ్ కేంద్రాల్లో త్రాగునీరు, విద్యుత్, టాయిలెట్ తదితర అన్ని మౌళిక సదుపాయాలు వుండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. మిషన్ భగీరథ నీటి సరఫరా లేనిచోట ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాలకు అవసరమున్నచోట పెయింటింగ్ వేయాలని, టాయిలెట్లలో రన్నింగ్ వాటర్ ఉండాలన్నారు. ఫ్యాన్లు, లైట్లు సరిపోను వుండేలా చర్యలు చేపట్టాలన్నారు. భద్రతాపరంగా చర్యలు తీసుకోవాలని, కాంపౌండ్ వాల్ లేని పోలింగ్ కేంద్రాలకు వెంటనే కాంపౌండ్ వాల్ ఏర్పాట్లు చేయాలని ఆయన అన్నారు. ఒకే లోకేషన్ లో ఒకటి కంటే ఎక్కువ పోలింగ్ కేంద్రాల ఏర్పాటు ఉన్నచోట, క్యూ, రద్దీ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. స్వీప్ కార్యాచరణ లో భాగంగా కాంపౌండ్ గోడలపై ఓటరు అవగాహనకు సంబంధించి నినాదాలు వ్రాయించాలన్నారు. భద్రత పరంగా అన్ని చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలకు పాఠశాలను చూడగానే, ఇందులో పోలింగ్ కేంద్రం ఉన్నదనే ప్రత్యేకత కనిపించాలని కలెక్టర్ అన్నారు కలెక్టర్ తనిఖీ సందర్భంలో మునిసిపల్ ఇఇ కృష్ణలాల్, మండల విద్యాధికారి శ్రీనివాసరావు, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ సిహెచ్. స్వామి, అధికారులు తదితరులు ఉన్నారు.