-హన్మకొండ డిఇఓకి పి.డి.ఎస్.యు. వినతి.
ప్రజాబలం ప్రతినిధి హనుమకొండ జిల్లా జూన్21:పేద,మధ్య తరగతి వర్గాల విద్యార్థులు చదువుకుంటున్న ప్రభుత్వ విద్యాసంస్థల్లో కనీస మౌలిక వసతులు కల్పించడంలో రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పి.డి.ఎస్.యు. రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.నరసింహారావు,ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు అలువాల నరేష్ లు ఆగ్రహం వ్యక్తం చేశారు.బుధవారం హనుమకొండ లో పి.డి.ఎస్.యు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా విద్యాశాఖ అధికారి (డిఇఓ) డాక్టర్ ఎండి.అబ్దుల్ హాయ్ కి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ప్రతినిధి బృందంగా ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా బి.నరసింహారావు,అలువాల నరేష్ లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం పట్ల అనుసరిస్తున్న నిర్లక్ష్య విధానాల ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కుంటుపడుతున్నదని,దీంతో పేద విద్యార్థులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.పాఠశాలలు ప్రారంభమై పది రోజులు గడుస్తున్నప్పటికీ నేటికీ ప్రభుత్వ హై స్కూల్స్ లో విద్యార్థులకు సరిపడా పాఠ్యపుస్తకాలు,నోటుబుక్స్, యూనిఫామ్స్,షూస్ అందించలేక పోయారని తెలిపారు.ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకపోవడం వలన పాఠశాల విద్య రోజు రోజుకు కుంటుపడుతున్నదని, వాచ్ మెన్,స్కావెంజర్లు లేక ప్రభుత్వ పాఠశాలలు అపరిశుభ్రంగా అస్తవ్యస్తంగా తయారవుతున్నాయని అన్నారు.విద్యార్థులకు సరిపడా తరగతి గదులు,బాత్రూమ్స్ లేకపోవడంతో బయటకు చెప్పుకోలేని అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత విద్యాశాఖ అధికారులు స్పందించి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసి విద్యార్థులకు మంచినీరు అందించాలని,పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడా తరగతి గదులు,బెంచీలు,కంప్యూటర్స్,ఫ్యాన్స్ ఏర్పాటు చేయాలని,పుస్తకాలు,నోట్ బుక్స్,యూనిఫామ్స్,షూస్ అందించాలని డిమాండ్ చేశారు. అలాగే రకరకాల ఫీజుల పేరిట ప్రైవేట్ విద్యా సంస్థలు చేస్తున్న ఫీజుల దోపిడిని అరికట్టాలని,విద్య హక్కు చట్టాన్ని పాటించకుండా కొనసాగుతున్న ప్రైవేట్,కార్పొరేట్ విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పిడిఎస్యు జిల్లా నాయకులు అలువాల ప్రవీణ్, అభిరామ్,ఎం.సతీష్,మేడి అశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.