ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీజేపీ నేతలపై రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విమర్శలు చేయడం సరికాదని బీజేపీ పెద్దపల్లి జిల్లా ఇన్చార్జి రావుల రామ్ నాథ్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించారు. దసరా పండుగ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్థానిక బంగల్ పేట్ మహాలక్ష్మి అమ్మవారి దర్శించుకున్న సమయంలో కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహంతో జై శ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు చేస్తే జీర్ణించుకోలేని మంత్రి అసత్య ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొన్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని నియోజకవర్గంలోని మెజార్టీ ప్రజలు బీజేపీలో పెద్ద ఎత్తున చేరుతున్నారని తెలిపారు. డిసెంబర్ 3న వెలువడే ఫలితాల్లో మహేశ్వర్ రెడ్డి గెలుపొందడం ఖాయమని ఇంద్రకరణ్ రెడ్డి మాజీ మంత్రిగా మిగిలిపోతారని జోస్యం చెప్పారు. ఇప్పటికైనా బీజేపీ అభ్యర్థిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. లేనట్లయితే ప్రజాక్షేత్రంలో ఓటమి తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు సామ రాజేశ్వర్ రెడ్డి, మెడిసేమే రాజు, దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు రాచకొండ సాగర్, ప్రకటన ప్రధాన కార్యదర్శులు అల్లం భాస్కర్, శ్రీరామోజు నరేష్, నాయకులు రావుల వారి విట్టల్, వెంకట్, తదితరులు ఉన్నారు.