జిల్లాలో ఉప్పొంగిన భక్తి ప్రవాహం
ఊరూరా వైభవోపేతంగా వేడుకలు
శోభాయాత్రలు.. అన్నదానాలు.
మార్మోగిన శ్రీరాం జపం..
రాముని నామం స్మరిస్తే ముక్తి లభిస్తుంది..
శ్రీ మాదవానంద సరస్వతి స్వామి
మెదక్ జనవరి 22 ప్రాజబలం న్యూస్:-
అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠను పురస్కరించుకొని మెదక్ జిల్లా వ్యాప్తంగా జరిగిన కార్యక్రమాలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. పల్లెలు.. పట్టణాలు.. వీధులు.. అంతటా రామనామం మార్మోగింది.అందరి బంధువు రామయ్య అంటూ ఆలయాలకు జనులు తరలొచ్చారు. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు జరిగాయి. వేలాదిమంది భక్తులు పాల్గొన్నారు.
మెదక్ జిల్లా కేంద్రంలోని వీధివీధినా జై శ్రీరాం అంటూ చిన్న పెద్ద తారతమ్యం లేకుండా రామనామ సంకీర్తన లు మార్మోగాయి. మెదక్ పట్టణంలోని శ్రీ కోదండ రామాలయం, ప్రాచీన రామాలయంలో శ్రీ మాదవానంద సరస్వతి స్వామి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అనుగ్రహ భాషణం చేస్తూ.. రామనామం స్మరిస్తే చాలు మానవునికి ముక్తి లభిస్తుందన్నారు. మావన సమాజంలో మంచిని గ్రహించాలన్నదే పరమార్థం అని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలన్నారు. కోట్లాది హిందువులు కల సాకారమైన వేళ.. ఘనంగా బాలరామున్ని ప్రతిష్ట కోసం ఆహ్వానించిన తరుణంలో ఇళ్లు, ఆలయాలు, మందిరాలు శ్రీ రామ గానామృతంతో పరవశించాయి.

శోభాయాత్రలు, ర్యాలీలు
అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా జిల్లా కేంద్రమంతా పండుగ వాతావరణం నెలకొంది. రామాలయాలు, ఆంజనేయస్వామి దేవాలయాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక పూజ కార్యక్రమాలతో ఆలయాలన్నీ సందడిగా మారాయి. బాల రాముడి ప్రతిష్ఠ జరిగిన ముహూర్తంలోనే శోభాయాత్రలు, కోలాటాలు, భజనలతో ప్రదర్శనలతో పట్టణం హోరెత్తింది. ఆలయాలు, ప్రధాన కూడళ్లలో అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అయోధ్యలో జరిగే మహత్తర కార్యక్రమాన్ని పలు ఆలయాలలో అయోధ్యలో జరిగిన కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఎస్ఈడీ తెరలను ఏర్పాటు చేశారు.
ప్రత్యేక కార్యక్రమాలతో హోరెత్తిన కోదండ రామాలయం..

అయోధ్యలో బాల రాముని
విగ్రహ ప్రతిష్ఠ వేళ జిల్లా కేంద్రంలోని శ్రీ కోదండ రామాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉదయం నుంచే ఆధ్యాత్మిక కార్యక్రమాలతో కిటకిటలాడింది. వేలాది మంది భక్తులు తరలివచ్చారు. రాత్రి వరకు నిరంతరాయంగా రామనామ సంకీర్తనలు, పారాయణాలు కొనసాగాయి. సాయంత్రం ప్రత్యేక పూజలు, భజనలు, మహిళలు కోలాటాలు, సహస్ర దీపారాధన, చిన్నారుల భరతనాట్యం, కళ్ళు జిగేల్ మనిపించేలా వేడుకలు నిర్వహించారు. దీపావళి తలపించే బాణా సంచా వెలుగులతో ఆ ప్రాంతమంతా వెలిగిపోయింది. ఆలయ ప్రాంగణం భక్తుల రామ కీర్తనలతో హోరెత్తింది. ఈ వేడుకల్లో ఆలయ కమిటీ చైర్మన్ బండ నరేందర్ సభ్యులు నందిని శ్రీనివాస్, బద్రినాథ్, పురుషోత్తం, నగరం మల్లేశం, బాల్ రాజ్, సకిలం శ్రీనివాస్, దేవేందర్ రెడ్డి, రాందేవ్, మాధవరెడ్డి, ఆలయ అర్చకులు శ్రీ భాష్యం మధుసూదన్ చార్యులు, రంగాచార్యులు, భాను శర్మ, వైద్య శ్రీనివాస్ శర్మ, కృష్ణ మూర్తి శర్మ, తదితరులు పాల్గొన్నారు.
