-బౌతిక కాయానికి నివాళులర్పించిన జర్నలిస్టులు
మంచి జర్నలిస్టు మిత్రుడిని కోల్పోయాం
టీడబ్ల్యూజే ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య
సీనియర్ జర్నలిస్టు ఎన్ సీ బీంరావు యాదవ్(60) శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. హైదరాబాద్ లోని ముషీరాబాద్ కేంద్రంగా ఆయన వివిధ పత్రికల్లో దాదాపు మూడు దశాబ్దాల పాటు విలేకరిగా పనిచేశారు. ప్రధానంగా ఆంధ్రజ్యోతి,ఈనాడు పత్రికల్లో చాలాకాలం పనిచేసిన బీంరావు స్థానిక ప్రజా సమస్యలపై వార్తలు,కథనాలు రాసి,సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారు. మంచి వ్యక్తిత్వం, పట్టుదల, అందరితో కలివిడిగా ఉండే బీంరావు హఠాన్మరణం దిగ్బ్రాంతిని కలిగించింది. శుక్రవారం సాయంత్రం వరకు చురుగ్గా ఉన్న బీంరావు శనివారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో మౌలాలిలోని ఆయన ఇంట్లో హఠాత్తుగా గుండెపోటుతో మరణించారు. ఆయనకు భార్య, ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు. బీంరావు బౌతిక కాయానికి సాయంత్రం మౌలాలిలో అంత్యక్రియలు జరిగాయి.
బీంరావుకు పలువురు జర్నలిస్టుల సంతాపం
జర్నలిస్టు బీమ్ రావు మరణవార్త తెలియగానే తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజే ఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య మౌలాలిలోని ఆయన ఇంటికి వెళ్లి బీంరావు బౌతిక కాయానికి పూలమాల వేసి శ్రద్దాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన బీంరావుతో తనకున్న సాన్నిత్యాన్ని గుర్తు చేశారు. ఆంధ్రజ్యోతిలో తనతో పాటు పని చేశాడని, తనకు మంచి మిత్రుడని మామిడి సోమయ్య తెలిపారు. బీంరావు హఠాన్మరణం చెందడం చాలా బాధాకరమని, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని పేర్కొంటూ, బీంరావు మృతికి సంతాపం, అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బీంరావు బౌతిక కాయానికి గ్రేటర్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ కార్యదర్శి బొల్లం శ్రీనివాస్,ముషీరాబాద్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ నాయకులు సీహెచ్ వీరారెడ్డి, కనకరాజు,
సాగర్,రాంరెడ్డి, నాగరాజు, తెలంగాణ జన సమితి గ్రేటర్ అధ్యక్షుడు నర్సయ్య తదితరులు నివాళులర్పించారు.
బీంరావు మృతికి దత్తాత్రేయ సంతాపం
సీనియర్ జర్నలిస్టు ఎన్ సి భీం రావు యాదవ్ మృతి పట్ల హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ తీవ్ర సంతాపాన్ని తెలియజేసారు. భీం రావు మరణ వార్త తనకు తీవ్ర దుఃఖాన్ని కలిగించిందని, గత మూడు దశాబ్దాలుగా ఆయన పాత్రికేయ రంగంలో విశేష సేవలందించారని, ముషీరాబాద్ నియోజకవర్గంలో అనేక సమస్యలు తన వార్తా కథనాల ద్వారా అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి సమస్యల పరిష్కారానికి కృషిచేశారని తెలిపారు.భీం రావు మరణం పాత్రికేయ రంగానికి తీరని లోటు అని బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు.భీం రావు మృతి పట్ల తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నానని, వారి ఆత్మకు శాంతిని చేకూర్చాలని, అలాగే ఈ కష్టకాలంలో బాధను తట్టుకోవడానికి వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు దత్తాత్రేయ
తెలియజేసారు.