రైతుకు భరోసా ఏది ?
సామాన్యులను నిరాశ పర్చారు
బీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత , ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వర్ రావు
ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 10 (ప్రజాబలం) ఖమ్మం అంత ఉరిమి ఉరిమి ఇంతేనా కురిసింది అన్నట్లు ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ అని బీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వర్ రావు వ్యాఖ్యానించారు. శనివారం రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా లేదని నామ నాగేశ్వర్ రావు పేర్కొన్నారు. వ్యవసాయానికి బడ్జెట్లో రూ.7,085 వేల కోట్లు కోత విధించడంతో రైతాంగం సంక్షోభం ఎదుర్కొంటుందని చెప్పారు. గత బడ్జెట్లో వ్యవసాయానికి రూ.26,831 కోట్లు కేటాయించగా… ప్రజా పాలన పేరుతో పరిపాలన ప్రారంభించిన కాంగ్రెస్ ప్రభుత్వం తాజా బడ్జెట్లో కేవలం రూ.19,746 కోట్లు మాత్రమే కేటాయింపులు చేశారని అన్నారు. రైతుబంధు పథకం పెట్టి, సీఎం కేసీఆర్ మన రాష్ట్ర రైతాంగాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించారని నామ గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం… రైతులు, కౌలు రైతులకు ఏటా రూ. 15,000 పంట పెట్టుబడి సాయం ఇస్తామని చెప్పారని… బడ్జెట్లో చూస్తే అదేం లేదని ఎత్తి చూపారు. రుణమాఫీ కి నిధులు కేటాయించ లేదన్నారు.వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి రూ. 12,000 సాయం…. వరి పంటకు ప్రతి క్వింటాల్‌కు రూ. 500 బోనస్ బడ్జెట్లో ప్రస్తావన లేకపోవడం దారుణమని అభిప్రాయపడ్డారు. రైతులు, సామాన్య ప్రజలను ఈ బడ్జెట్ తీవ్ర నిరాశ పరిచిందని చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్ రైతును రాజు చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తే, రెండు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నను ఆగం చేసిందని నామ ఆందోళన వ్యక్తం చేశారు.నిరుద్యోగ భృతి ఊసే లేదన్నారు.