మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో ప్రతి ఒక్కరూ కంటివెలుగులో పరీక్షలు చేయించుకోవాలి
జవహర్నగర్లో రెండో దశ కంటివెలుగును ప్రారంభించిన రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి
మేడ్చల్ ప్రజాబలం ప్రతినిధి జనవరి 19:తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతూ ప్రతినిత్యం వారి బాగుండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పరితపిస్తుంటారని అందులో భాగంగానే రాష్ట్రంలో ప్రజలు కంటి ఇబ్బందులతో బాధపడకూడదని కంటిచూపునకు ప్రాముఖ్యతనిస్తూ ప్రతిష్టాత్మకంగా కంటివెలుగు కార్యక్రమాన్ని చేపట్టినట్లు రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. జిల్లాలోని జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మల్కారం మండల ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన కంటివెలుగు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ హరీశ్ తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ముందుగా అరవైఐదు ( 65)సంవత్సరాల వృద్ధురాలైన జీనత్ బేగమ్కు మంత్రి మల్లారెడ్డి సమక్షంలో కంటి పరీక్షలు నిర్వహించారు. అనంతరం మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టే కార్యక్రమాలన్నీ ప్రజల కోసమేనని అందులో భాగంగా ఎవరు కూడా కంటిచూపుతో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించడం ప్రజల పట్ల ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఉన్న సంక్షేమానికి, బాధ్యతకు నిదర్శనమన్నారు. కంటిచూపునకు ప్రాముఖ్యతనిస్తూ కంటివెలుగు కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికీ పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి కళ్ళద్దాలు అందించేలా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొన్న చారిత్రాత్మక నిర్ణయమని ఇలాంటి సంక్షేమ పథకాలు దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ కూడా చేపట్టలేదని మంత్రి మల్లారెడ్డి వివరించారు. ప్రజలకు కంటిచూపునకు సంబంధించి ఇబ్బందులు ఉండకూడదని రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని కంటి వెలుగు కార్యక్రమం ప్రతి గ్రామం, తండాలతో పాటు మున్సిపాలిటీలో ప్రజందరికీ కంటి పరీక్షలు నిర్వహించేందుకు 1,500 బృందాల (టీమ్)తో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. పేదలు కంటి పరీక్షలు చేసుకొనేందుకు ప్రైవేట్ కళ్ళ దవాఖానాలకు వెళ్ళకుండా వారి వద్దకే వచ్చి కంటి పరీక్షలు చేయడంతో పాటు అవసరమైన వారికి కళ్ళద్దాలు, మందులు అందచేయడం జరుగుతుందని దీనిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజల కోసం చేపట్టిన కంటివెలుగు కార్యక్రమాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులందరూ కలిసి విజయవంతం చేయాలని మంత్రి కోరారు.
అనంతరం జిల్లా కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలు కంటిచూపుతో ఇబ్బందులతో బాధపడకూడదనే మంచి ఉద్దేశంతో కంటివెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని దీనిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. 2018లో మొదటి విడత కంటివెలుగు కార్యక్రమం ఎంతో విజయవంతమైందని తెలిపారు.
అలాగే ప్రస్తుతం రెండోవిడత కంటివెలుగులో ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని కంటి పరీక్షలు చేయించుకొన్న వారికి రీడింగ్ కళ్ళద్దాలను ఇవ్వడంతో పాటు ప్రత్యేకంగా అవసరమైన వారికి కళ్ళద్దాలను నేరుగా వారి ఇళ్ళకే పంపించడం జరుగుతుందని కలెక్టర్ హరీశ్ స్పష్టం చేశారు. కంటి పరీక్షలు నిర్వహించిన అనంతరం కళ్ళ మందులు, ఇతర మెడిసిన్స్ అప్పటికప్పుడే అక్కడే ఇస్తారని వైద్యులు సూచించిన ప్రకారం వాటిని వాడాలని కలెక్టర్ సూచించారు. కంటిచూపు ఇబ్బందులతో బాధపడుతున్న పేదలకు ప్రభుత్వం నిర్వహిస్తోన్న కంటివెలుగు ద్వారా ఎంతో ఉపయోగకరంగా మారిందని వారు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళకుండా పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని దీనిని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని కలెక్టర్ హరీశ్ తెలిపారు. కంటివెలుగులో అనుభవజ్ఞులైన డాక్టర్లు, సిబ్బంది ఉండి తమ సేవలందిస్తారని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా విజయవంతమయ్యేలా అన్ని రకాల చర్యలు తీసుకొన్నామని తెలిపారు. దీంతో పాటు ఆయా గ్రామాలు, మున్సిపాలిటీల్లో కంటివెలుగు శిబిరాలు నిర్వహించే తేదీలను ముందుగానే తెలియజేయాలని ఇప్పటికే సంబంధిత అధికారులు, సిబ్బందికి సూచించామని కలెక్టర్ హరీశ్ వివరించారు. ఈ విషయంలో తప్పకుండా ముందస్తు సమాచారం అందించాలని దీనివల్ల ప్రజలు పరీక్షలు నిర్వహించుకోవడానికి వస్తారని కలెక్టర్ తెలిపారు. అలాగే కంటివెలుగు పరీక్షలకు వచ్చిన వైద్యులు, సిబ్బందికి అన్ని ఏర్పాట్లు చేయడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ఉండాలని కలెక్టర్ హరీశ్ వివరించారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ కంటివెలుగులో పరీక్షలు నిర్వహించి విజయవంతం చేసి రాష్ట్రంలోనే జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని కలెక్టర్ హరీశ్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీనివాస్, జవహర్ నగర్ మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ శ్రీనివాస్, కార్పొరేటర్లు, కో–ఆప్షన్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.