ఖమ్మం కాల్వొడ్డులో భారీగా అన్నదానం
ట్రస్ట్ నేతృత్వంలో పలు చోట్ల ఎన్టీఆర్‌కు ఘన నివాళులు
ఖమ్మం ప్రతినిధి జనవరి 18 (ప్రజాబలం) ఖమ్మం నవరస నటనా సార్వ భౌముడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్బంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నామ ముత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ నేతృత్వంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.పలు చోట్ల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి,ఘనంగా నివాళుల ర్పించారు. నామ ముత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ నందమూరి బాలకృష్ణ అభిమాన సంఘం, బసవ తారకం క్యాన్సర్ అస్పత్రి ఆధ్వర్యంలో ఖమ్మం కాల్వొడ్డులో భారీ ఎత్తున ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి కూరపాటి వెంక టేశ్వర్లు ప్రారంభించారు అనంతరం వారితో పాటు ఎంపీ క్యాంప్ ఆఫీస్ ఇన్చార్జి కనకమేడల సత్యనారాయణ తదితరులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి, శ్రద్ధాంజలి ఘటించి, నివాళులర్పించారు. ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడుతూ నటనలోనే కాకుండా రాజకీయంగా తనదైన ముద్ర వేసిన ఎన్టీఆర్ అనితర సాధ్యుడని, చిరస్మరణీయుడని అన్నారు. ఏ పాత్ర అయినా ఆయన చేస్తేనే ఆ పాత్రకు నిండుదనం వస్తుందన్నారు. సినిమాల్లోనే కాదు రాజకీయల్లోనూ ఆయన అతి తక్కువ సమయంలో సంచలనం సృష్టించిన ఘనుడని కొనియాడారు. సమాజమే దేవాలయం..ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో పేద వానికి పట్టెడన్నం పెట్టాలన్న సంకల్పంతో కిలో రెండు రూపాయల బియ్యం పధకాన్ని ప్రవేశపెట్టిన మహనీయుడని కొనియాడారు తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచం నలు దిశలా వ్యాపింప చేసిన అవతార పురుషుడని పేర్కొన్నారు. ఎన్నో సంక్షేమ పధకాలతో కోట్లాది మంది ప్రజల హృదయాల్లో కొలువైనారని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి గుత్తా సీతయ్య, రూరల్ మండల పార్టీ అధ్యక్షులు సానబోయిన శ్రీనివాస్ గౌడ్, జిల్లా టెలికాం సలహా మండలి సభ్యులు చిత్తారు సింహాద్రి యాదవ్, నందమూరి బాలకృష్ణ అభిమాన సంఘం నాయకులు తాళ్లూరి శ్రీనివాసరావు కొడకంటి ఆంజనేయులు, టిడిపి ఖమ్మం నగర అధ్యక్షులు వడ్డె విజయ్, తెలుగు యువత నాయకులు నల్లమల రంజిత్, 35వ డివిజన్ కార్పొరేటర్ యల్లంపల్లి వెంకట్రావ్, నామ సేవా సమితి నాయకులు చీకటి రాంబాబుతో పాటు మేకల సత్యావతి బెల్లంకొండ శ్రీనివాస్ ఊర్మి కాళేశ్వరరావు శ్రీకాంత్ స్వాతి మంగ తదితరులు పాల్గొన్నారు.
