కార్మిక వర్గ హక్కుల సాధనకై ఉద్యమిద్దాం.
సిఐటియు ఆధ్వర్యంలో బోయినపల్లి మండల కేంద్రంలో మే డే జెండా ఆవిష్కరణ.
రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, బోయినపల్లి, ( ప్రజాబలం ), బోయినపల్లి మండల కేంద్రంలో అన్ని రంగాల కార్మికుల ఆధ్వర్యంలో గురువారం రోజున మేడే కార్మిక దినోత్సవాన్ని అట్టహాసంగా జరుపుకోవడం జరిగింది. 1886 సంవత్సరంలో అమెరికాలోని చికాగో నగరం హే మార్కెట్లో 8 గంటల పని విధానం, వెట్టి చాకిరి విముక్తి, కనీస హక్కుల కోసం కార్మికులు సాగించిన వీరోచిత పోరాటాన్ని సహించలేని పోలీసులు, యాజమాన్యాలకు తొత్తులుగా మారి జరిపిన మారణకాండ, ఎదురుకాల్పులలో 8 మంది కార్మికులు అమరులయ్యారు. వేలాది మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. అనేకమంది కార్మికులపై అక్రమ కేసులు బనాయించారు.139 సంవత్సరాల క్రితం కార్మికులు సాగించిన వీరోచిత పోరాటం ఫలితంగా కార్మిక వర్గానికి ఎనిమిది గంటల పని దినంతో పాటు కొన్ని హక్కులు దక్కాయి.
కానీ నేటి కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుండి భారత దేశంలోని బడా పెట్టుబడిదారులు గా పేరుగాంచిన అంబానీ, ఆదానిలాంటి పెట్టుబడిదారులకు లాభం చేకూరి విధంగా, దేశ సంపదను వారికి కారు చౌకగా కట్టబెడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్నది. స్వాతంత్రం రాకముందే కార్మికులు ఎన్నో త్యాగాలు చేసి పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి, యజమానులకు, కార్మికులను కట్టు బానిసలుగా చేసే విధంగా నాలుగు లేబరు కోడ్లను తీసుకువచ్చి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టింది. భవిష్యత్తులో కార్మికులు కనీస వేతనాలపై ప్రశ్నించకుండా, సంఘం పెట్టుకోకుండా వీలు లేకుండా కార్మికులను కట్టు బానిసలుగా చేసి వారి శ్రమను దోపిడీ చేసే విధంగా బిజెపి ప్రభుత్వం అవలంబిస్తుంది. ప్రజలలో వస్తున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు మతం పేరుతో, కులం పేరుతో, ప్రాంతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడుతూ, దేశభక్తి పేరుతో నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ సంపద కార్పోరేట్ శక్తులకు దోచిపెడుతుందన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్ని రంగాల కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని, డిమాండ్లు నెరవేరుస్తామని హామీలు ఇచ్చి ఇప్పటికి 15 నెలలు అవుతున్న కూడా ఏ ఒక్క హామీని అమలు చేయకుండా కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తుంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కోసం కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బోయినపల్లి మండల సిఐటియు కన్వీనర్ గురజాల శ్రీధర్, జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు రామంచ అశోక్, మరియు స్థానిక హమాలి సంఘం అధ్యక్షులు రాజనర్సు, లచ్చయ్య, పెగ్గర్ల శంకర్, పొత్తూరి నర్సయ్య, మరియు పవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు ఎడపల్లి బాబు, బొజ్జ శ్రీను, రాజలింగం, ఎడపల్లి రాజు, వివిధ రంగాల కార్మికులు పాల్గొన్నారు.