ఇక చూసుకుందాం

 

2023 ఎన్నికల్లో ఒక్కరిని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 10 (ప్రజాబలం) ఖమ్మం వేటి కోసమైతే తెలంగాణ యువత ఆరాటపడ్డదో నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాటం చేశారో.. ఎవరికి ఏం వచ్చాయో తెలియదు కానీ.. కల్వకుంట్ల కుటుంబానికి మాత్రం అద్భుతంగా అన్నీ వచ్చాయని, తెలంగాణ బంగారు తెలంగాణ కాకపోయినా.. వారి కుటుంబం మాత్రం బంగారు కుటుంబం అయిందనీ బీఆర్ఎస్ బహిష్కృత నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం ఖమ్మంలో పొంగులేటి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో విషయాల్లో కేసీఆర్, కేటీఆర్ మాటలు నమ్మి మోసపోయానని.. పార్టీలో చేరిన చాలాకాలం తర్వాత వీరి గురించి తెలిసి జ్ఞానోదయం అయిందనన్నారు. ఎన్నో విషయాలల్లో తనను వాడుకొని నమ్మక ద్రోహం చేశారని ధ్వజమెత్తారు. పొంగులేటి పార్టీలోనే లేనన్నారని.. పార్టీలో లేని వ్యక్తిని ఇప్పుడు ఎట్లా సస్పెండ్ చేస్తారని ధ్వజమెత్తారు.

2014లో కొత్తగూడెంలో ఒక సీటు, 2018లో
ఖమ్మంలో ఒక సీటును గెలిచారని.. 2023 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా నుంచి ఒక్కరంటే ఒక్క బీఆర్ఎస్ నేతను కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వబోనని సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో తనలాంటి అసంతృప్త నేతలను ఏకం చేసి తానేంటో చూపిస్తానన్నారు. మొత్తానికి రావణాసురుడి కబంధ హస్తాల నుంచి ఇన్నాళ్లకు విముక్తి కలిగి భద్రాద్రి శ్రీరాముడి పాదాలను తాకే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెబుతున్నారన్నారు. తాను ఎప్పుడు ప్రజల క్షేత్రంలోనే ఉంటానని.. ఇకపై కూడా ప్రజల్లోనే తేల్చుకుంటాన్నారు.

ప్రజాబలాన్ని ఎవరూ ఆపలేరని చెప్పడానికి హుజూరాబాద్ ఉప ఎన్నికే నిదర్శనమని.. మీ పార్టీలో ఉన్న ముఖ్య నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంతమంది చిత్తశుద్దితో మీరు గెలవాలని చూస్తున్నారో పరిశీలించుకోవాలని శ్రీనివాసరెడ్డి చెప్పారు. మీ సొంత పార్టీ నాయకులే మీమీద తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. కొద్దిరోజుల్లో అది స్పష్టంగా చూడబోతున్నారన్నారు. ఎన్నో రోజుల నుంచి సస్పెండ్ చేయని మీరు కొత్తగూడెం సభతో ఎందుకు సస్పెండ్ చేశారో చెప్పాలని.. కనీసం షోకాజ్ నోటీసు ఇవ్వకుండా సస్పెండ్ చేశారని.. మీరు సస్పెండ్ చేసిన తీరు సరైందికాదన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking