ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మే 30 : తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో రెండు రోజులు పాటు నిర్వచించిన కోడూరు శాంతమ్మ స్మారక రాష్ట్ర స్థాయి బాల సాహిత్య సమ్మేళనంలో పాల్గొన్న స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దండేపల్లికి చెందిన కవి రచయిత తెలుగు భాషోపాధ్యాయుడు,ప్రముఖ సాహితీవేత్త గోపగాని రవీందర్ ను ఘనంగా సత్కరించారు. గురువారం హైదరాబాదులోని డాక్టర్ దేవులపల్లి రామానుజ రావు కళా మందిరంలో జరిగిన ‘ బడిలో తెలుగు భాష’అనే అంశం పైన ఆయన ప్రసంగించారు. తెలుగు సాహిత్యాన్ని పాఠ్యపుస్తకాల ద్వారా విద్యార్థులకు పరిచయం చేస్తున్న తీరు గురించి వివరించారు.బాల్య దశలోనే విద్యార్థులకు సుమారు 100 మంది తెలుగు ప్రాచీన ఆధునిక కవుల,రచయితల రచనలను పరిచయం చేస్తున్న విధానం తెలుగు భాష పై విద్యార్థులకు ఆసక్తిని కలిగించే విధంగా ఈ రచనలు దోహదపడుతున్నాయని కొనియాడారు.విద్యార్థులు సాహితీ రంగంలో రాణించటానికి సృజనాత్మక సాహిత్య ప్రక్రియల్లోని వారి రచనలు ఉపయోగపడతాయన్నారు. ఈ సందర్బంగా గోపగాని రవీందర్ ను తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి,ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె.చెన్నయ్యల చేతుల మీదుగా సత్కారాన్ని అందుకున్నారు.పలువురు కవులు,రచయితలు, ఉపాధ్యాయులు ఆయనకు అభినందనలు తెలిపారు.