అర్హులైన రైతులకు రుణమాఫీ

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్
ప్రజబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జూలై 18:
ప్రభుత్వ నిబంధనల మేరకు అర్హులైన రైతులకు రుణమాఫీ పథకం అందేలా పకడ్బందీగా బ్యాంకు లు, సహకార సొసైటీ బ్యాంక్ అధికారులు చర్యలు తీసుకోవాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ సంబంధిత అధికారులకు ఆదేశించారు.
గురువారం రోజున విసి మీటింగ్ హాల్ నుండి వ్యవసాయ, బ్యాంక్ అధికారులు, డి సి సి బ్యాంక్ అధికారులు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల బ్యాంక్ అధికారులతో కలసి రైతు రుణమాఫీ పథకం కార్యక్రమం పై తీసుకోవలసిన చర్యల పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో డిసెంబర్ ,12 ,2018 తేదీన తర్వాత మంజూరైన లేక రెన్యువల్ అయిన పంట రుణాలకు,డిసెంబర్ 9, 2023 నాటికి బకాయి ఉన్న పంట రుణాలు తీసుకున్న రైతులకు ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. జిల్లా లో మొదటి విడతలో 2,667 మంది రైతు కుటుంబాలకు 12 కోట్ల 53 లక్షలు రుణమాఫీ పథకం అందజేయడం జరిగిందన్నారు. క్రాఫ్ట్ లోన్ కు అర్హులైన వారికి మొదటి విడత లో లక్ష రూపాయలు రైతు ఖాతాలో రెన్యువల్ చేయాలని కలెక్టర్ అన్నారు. రెండవ విడత 1లక్షా, 50 వేల వరకు, మూడో విడత రెండు లక్షల వరకు దశలవారీగా రుణమాఫీ కార్యక్రమం జరుగుతుందన్నారు. రైతు రుణమాఫీ పథకం పై రైతులకు సందేహాలు ఏమైనా ఉంటే జిల్లాలో వ్యవసాయ శాఖ కార్యాలయంలో ( గ్రీవెన్స్ సెల్) ఏర్పాటు చేసి రైతులకు సంబంధిత అధికారులు నివృత్తి చేయాలన్నారు. వ్యవసాయ అధికారులు బ్యాంక్ అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. మొదటి విడత లో రెన్యువల్ కాని వారు రెండవ, మూడవ విడతలలో రెన్యువల్ చేయడం జరుగుతుందన్నారు. ఈ పథకం అమలు కోసం ప్రతి బ్యాంకులో ఒక ప్రత్యేక నోడల్ అధికారిని నియమించి రైతులకు ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. క్రాఫ్ట్ లోన్ రెన్యువల్ విషయంలో ఎలాంటి పొరపాటు లేకుండా చూడాలని బ్యాంక్ అధికారులకు ఆదేశించారు. బ్యాంకు నోడల్ అధికారులు తమ సంబంధిత బ్యాంకు యొక్క పంట రుణాల డేటాను డిజిటల్ సంతకం చేయాలన్నారు. రుణమాఫీ కోసం వచ్చే రైతులకు పూర్తిగా సహకరిస్తూ వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవగాహన కల్పించాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి రేఖ మేరీ, ఎల్ డి ఎం శ్రీనివాసులు, బ్యాంక్ మేనేజర్ లు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking