ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 05 : జిల్లాలో పోషణ్ అభియాన్ కార్యక్రమం ద్వారా పోషణ లోపాన్ని అధిగమించే విధంగా అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని నస్పూర్లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో ఇన్చార్జ్ జిల్లా సంక్షేమశాఖ అధికారి స్వరూపారాణి,జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ అధికారి హరీష్ రాజ్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి గణపతి, జిల్లా వయోజన విద్యాధికారి పురుషోత్తం నాయక్లతో కలిసి ఈ నెల 30వ తేదీ వరకు చేయ తలపెట్టిన పోషణ్ మాహ్-2024 కార్యక్రమం సంబంధిత గోడప్రతులను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… పోషణ్ అభియాన్ కార్యక్రమం ద్వారా పోషణ లోపాన్ని అధిగమించేందుకు అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని తెలిపారు.పోషణ్ మాహ్ కార్యకలాపాల నిర్వహణపై రూపొందించిన కార్యచరణ ప్రకారం కార్యక్రమం నిర్వహించాలని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలలో గర్భిణులు, బాలింతలు, పిల్లల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, శామ్-మామ్ లోపాలు గల పిల్లలను గుర్తించి వారు సాధారణ స్థితికి వచ్చే లాగా సకాలంలో పౌష్టికాహారం, అవసరమైన మందులను అందిస్తూ ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.అంగన్వాడీల ద్వారా అందించే పౌష్టికాహారం వివరాలతో గ్రామపంచాయతీ కార్యాలయాలలో ప్రదర్శన కార్యక్రమాలు చేపట్టాలని,వ్యక్తిగత పరిశుభ్రత,పరిసరాల శుభ్రత అంశాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. పిల్లలకు కథల పుస్తకాలు చదవడం ద్వారా వారికి చదువుపై ఆసక్తి పెంచాలని,చిత్రాలను చూపించి మాట్లాడటం నేర్పించాలని, పిల్లలతో చదివించడం,కథలు చెప్పించడం చేయాలని,ఫన్ లాంగ్వేజ్,ఫ్లాష్ కార్డుల ఆటలు ఆడించాలని తెలిపారు.ఆశ, ఆరోగ్య కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్ల సమన్వయంతో గర్భిణులు, బాలింతలు,పిల్లలు, కిశోర బాలికలకు రక్తహీనత శిబిరాలు నిర్వహించి అవసరమైన పరీక్షలు నిర్వహించి తగు చికిత్స అందించేలా కృషి చేయాలని తెలిపారు. వంట చేసే ముందు,పిల్లలకు ఆహారం తినిపించే ముందు,మరుగుదొడ్డి వినియోగించిన తరువాత ఖచ్చితంగా చేతులు శుభ్రపర్చుకోవాలని, తినే, త్రాగే ఆహార పదార్థాలను ఎల్లప్పుడూ మూత పెట్టి ఉంచాలని, ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు నోటికి,ముక్కుకి రుమాలును అడ్డం పెట్టుకోవాలని ప్రజలకు వివరించాలని తెలిపారు.అనంతరం అందరిచే పోషణ్ అభియాన్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సి.డి.పి.ఓ.లు విజయలక్ష్మి,రేష్మ, పోషణ్ అభియాన్ జిల్లా సమన్వయకర్త రజిత,ఉమెన్ హబ్ టీం,సూపర్వైజర్లు, డి.పి.ఎ.లు, మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.