అర్హులైన ఏ ఒక్కరు కూడా తప్పిపోకుండా తప్పనిసరిగా ప్రజా పాలన కార్యక్రమం కింద దరఖాస్తు తీసుకోవాలని మెదక్ ఏం ఎల్ ఏ డా ‘ మైనంపల్లి రోహిత్ రావు

నిర్దేశిత ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హులందరికీ పథకాలు అమలు– జిల్లా కలెక్టర్ రాజర్షి షా
మెదక్ ప్రాజబలం న్యూస్:-

అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ద్వారా లబ్ది చేకూర్చాలనే కృత నిశ్చయంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మెదక్ శాసన సభ్యులు డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు అన్నారు . హవేలీ ఘనపూర్ మండలం బూరుగుపల్లి, గాజిరెడ్డి పల్లి గ్రామాలలో బుధవారం కొనసాగిన ప్రజా పాలన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాలనను ప్రజల ముంగిట్లోకి తెస్తూ, ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. గత నెల 28 నుండి ప్రారంభమైన ఈ కార్యక్రమానికి ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తోందన్నారు. ఇంకనూ మిగిలిఉన్న అర్హులైన కుటుంబాలు ఈ నెల 06 తేదీ వరకు కొనసాగే ప్రజాపాలన కార్యక్రమం సందర్భంగా దరఖాస్తులు అందించాలని సూచించారు. ప్రతి ఇంటికి ప్రభుత్వ ఫలాలు అందించటడమే ప్రభుత్వ లక్ష్యమని , అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తప్పనిసరిగా లబ్ది చేకూరుస్తుందని ఆయన స్పష్టం చేశారు.

జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాటాడుతూ , రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభయహస్తం క్రింద ఐదు గ్యారెంటీల దరఖాస్తులు ప్రజల నుండి స్వీకరించేందుకు జిల్లా, మండల యంత్రాంగం మొత్తం ప్రజల మధ్యకే వచ్చిందని అన్నారు. ఆరు గ్యారెంటీలలో రెండు గ్యారెంటీలను ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజులకే అందించి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిందని, అలాగే ప్రభుత్వ ఆసుపత్రులలో గుర్తించబడిన కార్పోరేట్ ఆసుపత్రులలో వైద్య చికిత్స కోసం రాజీవ్ ఆరోగ్యశ్రీ క్రింద 5 లక్షలను పది లక్షలకు పెంచడం జరిగిందని తెలిపారు. ప్రతి కుటుంబానికి లబ్ది చేకూరుతుందని, అందరూ సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో తొలుత ప్రజాపాలన ముఖ్య ఉద్దేశ్యం, ఆరు గ్యారెంటీలపై ముఖ్యమంత్రి సందేశం చదివి వినిపించారు.

కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు , అదనపు ఎస్ పి మహేందర్, జిల్లా మైనింగ్ & జియాలజీ శాఖ సహాయ సంచాలకులు జయరాజ్, పి డి . ఎస్ సి కార్పోరేషన్ అధికారిణి విజయలక్ష్మి , ఆర్ డి ఓ అంబదాస్ రాజేశ్వర్ , తహసీల్దార్ నారాయణ , సర్పంచ్ చిన్న గౌడ్ ,,సాయిబాబా ప్రజాప్రతినిధులు , అధికారులు , సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking