హైదరాబాద్ ప్రజాబలం ప్రతినిధి:అటవీ అమర వీరుల త్యాగాలను ఉద్యోగులెవరూ మరువొద్దని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కోరారు. సోమవారం జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నెహ్రూ జూలాజికల్ పార్క్ స్మారక చిహ్నం వద్ద మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, అధికారులు, సిబ్బంది పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ అటవీ సంపదను దోచుకునే స్మగ్లర్లు, అరాచక ముఠాలకు ఎదురొడ్డి ప్రాణాలర్పించి వీరమరణం పొందిన అటవీ సిబ్బంది త్యాగాలు వృధా కానివ్వకుండా, వారి ఆశయాలకు అనుగుణంగా పని చేయాలన్నారు. విధి నిర్వహణలో అటవీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విధి నిర్వహణలో 1984వ సంవత్సరం నుండి ఇప్పటివరకు మన రాష్ట్రంలో 22 మంది తమ అమూల్యమైన ప్రాణాలు కోల్పోవడం చాలా భాదకరమన్నారు.
విధి నిర్వహణలో అశువులు బాసిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. అదేవిధంగా అటవీ శాఖ ఉద్యోగులు, సిబ్బందికి ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు.అటవీ సంపదను రక్షించేందుకు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అటవీ శాఖ సిబ్బంది అహర్నిశలు కృషి చేస్తున్నారని అభినందించారు. అటవీ సంపద పరిరక్షణలో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
భద్రాది – కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస రావు గతేడాది నవంబర్ 22న గుత్తికోయల చేతిలో ప్రాణాలు కొల్పోయారని, అడవుల సంరక్షణ కోసం ఆయన చేసిన త్యాగం వెలకట్టలేనిదని అన్నారు.
శ్రీనివాస రావు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడిరదని, సీయం కేసీఆర్ గారు మానవత దృక్పథంతో ఆయన సతీమణి నాలగక్ష్మికి డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం కల్పించారని తెలిపారు. అంతేకాకుండా రూ. 50 లక్షల ఎక్స్ గ్రేషియాతో పాటు ఖమ్మం జిల్లాలో 500 గజాల ఇంటి స్థలాన్ని ప్రభుత్వం కేటాయించినట్లు తెలిపారు.
అమరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రకృతి ప్రసాదించిన వన సంపదను రేపటి మన భవిష్యత్తు, భావితరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.
అటవీ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా అటవీ అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడమే వారికి మనమిచ్చే ఘనమైన నివాళి అని పేర్కొన్నారు.అటవీ శాఖ ఆద్వర్యంలో చేపట్టిన పలు కార్యక్రమాలను మంత్రి వివరించారు.ఈ కార్యక్రమంలో అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్. ఎం. డోబ్రియాల్, వన్యప్రాణుల ముఖ్య సంరక్షణ అధికారి లోకేష్ జైస్వాల్, వీసీ %డ% ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, జూ పార్క్ డైరెక్టర్ ప్రసాద్, క్యురేటర్ సునీల్ హీరమత్, రిటైర్డ్ పీసీసీఎఫ్ పీకే రaా, మనొరంజన్ భాంజ, మునీంద్రా, రిటైర్డ్ ఐఎఫ్‌ఎస్ లు సునీల్ కుమార్ గుప్తా, బుచ్చి రామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.