పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పువ్వాడ

 

ఖమ్మం ప్రతినిధి అక్టోబర్ 2 (ప్రజాబలం) ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 15, 27, 28వ డివిజన్లలో రూ. 16.90 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ది పనులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సోమవారం శంఖుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా 15వ డివిజన్ అల్లీపురంలో రూ.9.89 కోట్లతో నిర్మించిన 168 డబుల్ బెడ్ రూం ఇళ్ల, రూ. 2 కోట్ల ఎస్ఎఫ్సి నిధులతో నిర్మించిన అధునాతన వైకుంఠధామం, రూ.1.50 కోట్లతో నూతనంగా నిర్మించిన 33/11 కె.వి విద్యుత్ సబ్ స్టేషన్ లను మంత్రి ప్రారంభించారు. రూ.90లక్షల ఎస్డీఎఫ్ నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్, సైడ్ డ్రైన్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. రూ.20 లక్షల సుడా నిధులతో నిర్మించిన సీసీ రోడ్స్ ను ఆయన ప్రారంభించారు. పుట్టకోటలో రూ.50లక్షల ఎల్ఆర్ఎస్ నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్స్ నిర్మాణ పనులకు, 27వ డివిజన్ లో రూ.15లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్స్ నిర్మాణ పనులకు, 28వ డివిజన్ లో రూ.35 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్స్ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలు కూడా ఆత్మగౌరవంతో బతకాలి అన్నదే ప్రభుత్వ సంకల్పమ‌ని, అందుకు అనుగుణంగానే రాష్ట్ర వ్యాప్తంగా డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల‌ను ప్ర‌భుత్వ‌మే క‌ట్టించి, పేద‌ల‌కు పంపిణీ చేస్తున్న‌ద‌ని అన్నారు. పైసా ఖర్చు లేకుండా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టి నిరుపేదలను కొత్తింట్లోకి పంపించడం చాలా సంతోషంగా ఉందన్నారు. గ‌త ప్ర‌భుత్వాల‌కు భిన్నంగా ఏదో ఓ ఇంటికి ఇంత డ‌బ్బు, మెటీరియ‌ల్ ఇచ్చి చేతులు దులుపుకోకుండా, ప్ర‌భుత్వం పేద‌ల ఆత్మ‌గౌర‌వం పెంచే విధంగా ప్రభుత్వ స్థలంలో డ‌బుల్ బెడ్ రూం ఇండ్లు క‌ట్టించింద‌న్నారు. పూర్తి పారదర్శకంగా అర్హులైన ల‌బ్ధ‌దారులను ఎంపిక చేసి వారికి ఇస్తున్నామని ఆయన తెలిపారు. లబ్ధిదారులతో కలిసి ఇండ్ల ప్రవేశం చేయడం, పాలు పొంగించడం అనందంగా ఉందన్నారు. ప్రభుత్వం బలహీన వర్గాలకు అండగా ఉన్నదని, అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం పని చేస్తున్నదన్నారు. దీనికి అదనంగా సొంత జాగా ఉన్న వారికి గృహలక్ష్మి పథకం ద్వారా పేదల సొంతింటి కలను ప్రభుత్వం నెరవేర్చిందని ఆయన అన్నారు. ఖమ్మం నియోజకవర్గంలో 3వేల మందికి గృహలక్మి మంజూరు కాగా, మరో వెయ్యి మందికి కూడా పథకం వర్తింపజేసి, మొత్తం నాలుగు వేల మందికి మంజూరు పత్రాలు అందజేశామని ఆయన అన్నారు. రైతులకు ప్రభుత్వం 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తుందని, తద్వారా రైతులు వేసిన పంటలు సమృద్ధిగా పండి అధిక దిగుబడులు వచ్చి రైతులు ఆర్ధికంగా నిలదొక్కుకున్నారని మంత్రి తెలిపారు. ఖమ్మంలో నలు దిక్కుల అభివృద్ది చేసుకున్నామని, కార్పొరేషన్ లోని ప్రతి డివిజన్ లో దాదాపు రూ.13 కోట్లకు పైగా కేవలం రోడ్లు, సీసీ డ్రెయిన్లు ఇతర మౌలిక సదుపాయాల కోసమే నిధులు మంజూరు చేసి పనులు చేశామన్నారు కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణంతో అల్లిపురం ప్రాంత చిరకాల కోరిక నెరవేరిందన్నారు. లో వోల్టేజ్, విద్యుత్ సమస్యలు లేకుండా నాణ్యమైన విద్యుత్ అందుతుందన్నారు. డబల్ బెడ్ రూమ్ ఇండ్లలో స్థానిక డివిజన్ లోని అర్హులైన లబ్ధిదారులకు ప్రాధాన్యం ఇస్తామని ఆయన తెలిపారు. అంతిమ సంస్కారం ఘనంగా ఉండాలని రూ. 2 కోట్లతో అన్ని వసతులతో వైకుంఠదామం నిర్మాణం చేసినట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, కార్పొరేటర్ లు రావూరి కరుణ సైదు బాబు, పగడాల శ్రీవిద్య, గజ్జెల లక్ష్మీ వెంకన్న, విద్యుత్ ఎస్ఈ సురేందర్, ఆర్ అండ్ బి ఈఈ శ్యాం ప్రసాద్, మునిసిపల్ ఇఇ కృష్ణలాల్, ఖమ్మం ఆర్డీవో జి. గణేష్, తహశీల్దార్ సిహెచ్. స్వామి, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ భీరెడ్డి నాగచంద్రా రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking