మార్కెటింగ్ వ్యవసాయ సహకార అధికారులతో సమావేశమైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

 

ఖమ్మం ప్రతినిధి మార్చి 2 (ప్రజాబలం) సచివాలయం హైదరాబాద్ లో రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకార జౌళి శాఖామాత్యులు తుమ్మల నాగేశ్వర రావు, ఖమ్మం మిర్చి మార్కెట్ యార్డ్ పునఃనిర్మించుటకు (మోడ్రనైజెషన్) కొరకు మార్కెటింగ్ శాఖ సంచాలకులు జి. లక్ష్మీబాయి, ఇతర అధికారులతో చర్చించడం జరిగినది. ఇట్టి విషయంలో ఖమ్మం మార్కెట్ యార్డ్ కి ప్రస్తుతం వస్తున్న మిర్చి బస్తాల రాబడి, కల్పించబడిన సదుపాయాలు, భవిష్యత్తులో రోజు వారీ గరిష్టం వచ్చే మిర్చి బస్తాల అంచనా, కల్పించాల్సిన సదుపాయాలు, ఆధునీకరణ గురించి అడిగి తెలుసుకున్నారు. మార్కెటింగ్ సంచాలకులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా పై విషయాలను తెలియజేస్తూ అంచనా వ్యయo గురించి కూలoకుశంగా వివరించడం జరిగినది. ప్రస్తుతము ప్రతి రోజు దాదాపుగా 70 నుంచి 80 వేల బస్తాల మిర్చి రాబడి మార్కెట్ యార్డ్ కి అమ్మకానికి వస్తుంది. జాతీయంగా, అంతర్జాతీయంగా వివిధ రకాలుగా మిర్చి వాడకం పెరగనున్నడం చేత భవిష్యత్తు కాలంలో మిర్చి పంట విస్తీర్ణం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. దాదాపు 2 లక్షల బస్తాలు వరకు కూడా కొనుగోలు అమ్మకాలు సజావుగా ఎటువంటి ఆటంకం లేకుండ వసతులు కల్పించే విధంగా మార్కెట్ ని ఆధునీకరించాలని తెలియజేయడం జరిగింది. అన్నీ విషయాలు చర్చించిన పిదప ప్రస్తుతం ఉన్న మార్కెట్ యార్డ్ ని పూర్తి స్థాయిలో ఆధునిక హంగులతో రైతులు, వ్యాపారస్తులు, ఎగుమతిదారులు, ఇతర మార్కెట్ వినియోగదారుల అవసరాలు తీర్చే విధంగా 16.80 ఎకరాల విస్తీర్ణంతో పునః నిర్మించడానికి నిర్ణయించడం జరిగినది. ఇట్టి పునః నిర్మాణానికి దాదాపు రూపాయలు 102.00 కోట్లు ఖర్చు కాగలదని ఇంజనీరింగ్ విభాగం ప్రాధమికంగా అంచనా వేయడం జరిగింది. ఇట్టి పనిని ప్రస్తుత మిర్చి మార్కెటింగ్ సీజన్ ముగిసేలోపే అనగా మే మొదటి వారంలోగా డిజైన్ లు తయారుచేసి టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పని మొదలు పెట్టాల్సిందిగా మంత్రి, అధికారులను ఆదేశించారు. మార్కెట్ కమిటీ ఆర్థిక స్థితిగతులను పరిగణలోనికి తీసుకొని పునఃనిర్మాణ పనులు అన్నీ ఒకేసారి కాకుండా దశల వారీగా పనులు పూర్తి చేయుటకు కాలపరిధితో కూడిన రోడ్ మ్యాప్ వేసుకోవాల్సిందిగా మంత్రి సూచించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking