నేటి తరం మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారంటే ఆనాడు మహిళలకు చదువు ఆవశ్యకతను గుర్తించి చదువు చెప్పడంవల్లేనని ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి అన్నారు

మెదక్, ఏప్రిల్ 11, 2023 నేటి తరం మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారంటే ఆనాడు మహిళలకు చదువు ఆవశ్యకతను గుర్తించి చదువు చెప్పడంవల్లేనని ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి అన్నారు. మహాత్మా జ్యోతిబా పూలే 197 వ జయంతి సందర్భంగా మంగళవారం కలెక్టరేట్ లోని ఆడిటోరియం లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖా ఆధ్వర్యంలో అధికారికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, బి.సి. అభివృద్ధి అధికారి కేశురాం, వివిధ సంఘాల నాయకులతో కలిసి ముందుగా పోలె చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన గావించారు. ఈ సంధర్భంగా మాట్లాడుతూ కుల వ్యవస్థలో లోపాలను గుర్తించి ఆనాడే సామాజిక సమానత్వం సాధన కోసం జ్యోతి బా పూలే సంస్కరణల కోసం ఎంతో కృషి చేశారని అన్నారు. చదువుతోనే జీవితంలో మార్పు సాధ్యమని విద్య ప్రాముఖ్యతను గుర్తించి తన భార్య సావిత్రి పూలే కు చదువుచెప్పించి అందరు మహిళలు కూడా చదువుకుంటే కుటుంబంతో పాటు సమాజం అభివృద్ధి చెందుతుందని భావించి కార్యోన్ముకులు కావడంవల్లే నేడు మహిళలు ఉన్నత శిఖరాలు అధిరోహించారని అన్నారు. రాష్ట్రం ప్రభుత్వం కూడా 2014 తరువాత ఎస్సి,ఎస్టీ,బి.సి. మైనారిటీ వర్గాలకు గురుకుల పాఠశాలలు నెలకొల్పడంతో పాటు పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నదాని, ముఖ్యమంగా బాలికల కోసం వసతులు కల్పిస్తున్నది అన్నారు. అణగారిన వర్గాలకు ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు అమలుచేస్తున్న మనవంతుగా భాగస్వామ్యం కావాలని అన్నారు. నేను 14 మంది బాలికలను దత్తత తీసుకొని ఇంజనీరింగ్ చదివిస్తూ వారికి కావలసిన వనరులు సమకూరుస్తున్నానని, ఇలా ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా తగు సహాయం అందిస్తే సమాజం కూడా బాగుపడుతుందని అన్నారు.
జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ సమాజంలో ఉన్నరుగ్మతలను, సాంఘీక దురాచారాలను తుదముట్టించేందుకు అనేక అవరోధాలు, అవమానాలు ఎదురైనప్పటికి పూలే చేసిన కృషి అనన్య సామాన్యమనీ, వారి పోరాట ఫలితాలు మనమీనాడు అనుభవిస్తున్నాని అన్నారు. అణగారిన వర్గాలు, శూద్రులు సమానత్వం సాధించాలంటే విద్య ఎంతో అవసరమని గుర్తించి వారికి విద్య అందేలా తీవ్రంగా కృషి చేశారని, మహిళల విద్య కోసం పాటుపడిన మొదటి వ్యక్తి పూలే అని అన్నారు. కులవ్యవస్థ నిర్మూలనకు ఎంతో కృషి చేసినారని, నేడు సమాజంలో అందరు సమానంగా జీవిస్తున్నారంటే పూలే కృషి ఫలితమే అని అన్నారు. ఎక్కడైనా కులవ్యవస్థపై సంఘటనలు జరిగితే గొంతు విప్పాలని అన్నారు. తెలంగాణా ప్రభుత్వం అన్ని కులాల వారికి గురుకులాలు, వసతి గృహాలు ఏర్పాటు చేసి విద్యార్థిని, విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తున్నదని,కాబట్టి చదువుపై శ్రద్ధ పెట్టి బాగా చదవాలని హితవు చెప్పారు. తరతరాల తలరాతను మార్చేది చదువు ఒక్కటే అని ప్రతి ఒక్కరు బాగా చదువుకోవాలని , మహనీయుల చరిత్రను తెలుసుకొని వారి ఆశలు, ఆశయాలకనుగుణంగా ముందుకు సాగాలని అన్నారు.

ఎస్పీ రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ సమాజంలో అందరు సమానమేనని, కులాలకు అతీతంగా అందరు ఐకమత్యంగా ఉండాలని కుల బహిష్కరణకు పాటుపడిన సంఘ సంస్కర్త జ్యోతి బా పూలే అని అన్నారు. విభజించి పాలించు సిద్దాంతతో ఆనాడు బ్రిటిష్ పాలకులు దేశంలో కులాల మధ్య మత చిచ్చు పెట్టడానికి ప్రయత్ని కుల వ్యవస్థ నిర్మూలనకు ఆనాడే బీజం వేసిన మొదటి సంఘ సంస్కర్త పూలే అని కొనియాడారు. చదువుకుంటేనే సమాజంలో అన్యాయాన్ని ధైర్యంగా ఎదుర్కోగలుగుతామని, కాబట్టి ప్రతి ఒక్క బాలిక చదువుకోవాలని తన ఇంటి నుండే ఉద్యమం ప్రారంభించిన మహనీయుడు పూలే అని అన్నారు. బాలికలు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా గురుకుల పాఠశాల, వసతి గృహ విద్యార్థిని, విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి.
అంతకుముందు స్థానిక ధ్యాన్ చంద్ చౌరస్తాలో గల జ్యోతి బా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బి.సి.యువజన సంఘ అధ్యక్షులు చంద్రశేఖర్, బి..సి సంఘం జిల్లా అధ్యక్షులు మెట్టు గంగారాం, ఉపాధ్యక్షులు యాదగిరి, టి.యెన్.జి.ఓ. కార్యదర్శి రాజ్ కుమార్, మునిసిపల్ చైర్మన్ చంద్ర పాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, డిఎస్పీ సైదులు, కౌన్సిలర్లు, వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking