జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి 02 : సహకార సంఘాలు రైతుల పరపతిని పెంచి ఆర్థికంగా పరిపుష్టం కావాలని, రైతులకు విశిష్టమైన సేవలు అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్ అన్నారు. గురువారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో ప్రాథమిక వ్యవసాయ సహాయక సంఘాల పునర్విభజన అంశంపై జిల్లా సహకార అధికారి బి.సంజీవరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి కల్పన, పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు శంకర్, జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఎ.జి.ఎం.రామకృష్ణ, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి గణపతి లతో కలిసి సహకార సంఘాల ప్రతినిధులు, మండల వ్యవసాయ అధికారులు, బ్యాంక్ మేనేజర్లు,సూపర్వైజర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలో రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రతిపాదనలు సమర్పించే సమయంలో సహకార సంఘాల ఆర్థిక పరిపుష్టిత,వ్యాపార లావాదేవీలు,సంఘ సిబ్బంది వివరాలు,భౌగోళిక సమస్యలను దృష్టిలో ఉంచుకొని రైతులకు ఉపయోగపడే విధంగా పునర్విభజన జరగాలని తెలిపారు.గ్రామీణ రైతుల అవసరాల ప్రాతిపదికన నూతనంగా ఏర్పాడిన రెవెన్యూ మండలాల ప్రాతిపదికన రైతు సహకార సంఘాల పునర్విభజన చేయాలని తెలిపారు. సహకార సంఘాల పునర్విభజన రైతులకు ప్రయోజనకరంగా ఉండాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.