ఎర్రుపాలెం లో శాతవాహన ఎక్స్ ప్రెస్ ను ఆపాలని ఎంపీ నామ వినతి

కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ను మళ్లీ కలిసి మళ్లీ లేఖ అందజేసిన ఎంపీ నామ నాగేశ్వరరావు

ఖమ్మం ప్రతినిధి జనవరి 03 (ప్రజాబలం) చారిత్రక ప్రసిద్ధ జమలాపురం వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రాన్ని పరిగణలోకి తీసుకొని ఎర్రుపాలెం రైల్వే స్టేషన్ లో శాతవాహన ఎక్స్ ప్రెస్ రైలును కొద్దిసేపు నిలుపుదల చేయాలని బీఆర్ ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు బుధవారం ఢిల్లీలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిసి ఈ మేరకు లేఖ అందజేశారు. తక్షణమే స్పందించి చర్యలు తీసుకొని, ప్రజలకు , యాత్రికులకు మేలు చేయాలని కోరారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని డోర్నకల్ – విజయవాడ మార్గంలో ఎర్రుపాలెం రైల్వే స్టేషన్ ఉందని, ఎర్రుపాలెం మండల పరిధిలోని జమలాపురంలో వెంకటేశ్వర స్వామి చారిత్రక దేవాలయంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్నారని, దీనిని తెలంగాణా చిన్న తిరుపతిగా కూడా పిలుస్తారని అన్నారు.ఈ చారిత్రక పుణ్యక్షేత్రానికి ప్రతి ఏడాది 10 నుంచి 15 లక్షల మంది భక్తులు , యాత్రికులు దూర ప్రాంతాల నుంచి వచ్చి స్వామి వారిని దర్శించుకుంటారని ఎంపీ నామ కేంద్ర మంత్రి దృష్టికి తీసికెళ్లారు. ఈ స్టేషన్ లో శాతవాహన ఎక్స్ ప్రెస్ ను కొద్దిసేపు నిలుపుదల చేయకపోవడం వల్ల భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఈ విషయమై తాను గతంలో 15, 17వ లోక్ సభ సమయాల్లో కూడా లోక్ సభలో పలుమార్లు ప్రస్తావించడంతో పాటు పలు విడతలుగా గౌరవ రైల్వే మంత్రి ని, ఎస్సీఆర్ జీఎం ను కలిసి లేఖలు అందజేయడం జరిగిందని గుర్తు చేశారు. అత్యంత ప్రసిద్ధి చెందిన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని , స్థానిక మండల ప్రజల ప్రయోజనాలను, గణనీయమైన ఆదాయాన్ని గమనంలో ఉంచుకుని శాతవాహన ఎక్స్ ప్రెస్ రైలును ఎర్రుపాలెం రైల్వే స్టేషన్ లో ఆగేలా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ కు ఆదేశాలు ఇవ్వాలని నామ నాగేశ్వరరావు రైల్వే మంత్రిని కోరారు. ఎర్రుపాలెం లో శాతవాహన ఎక్స్ ప్రెస్ నిలుపుదల చేయడం వల్ల యాత్రికులకు , దూర ప్రాంత భక్తులకు ఎంతో ఉపశమనం కలుగుతుందని నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking