మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ప్రజాబలం ప్రతినిధి మార్చి 21:
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా బోయిన్పల్లి నుంచి మెదక్ జిల్లా శివారులోని కాళ్ళకల్ వరకు విస్తరిస్తున్న 27 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ అన్నారు. మంగళవారం జాతీయ రహదారి విస్తరణ పనుల విషయమై జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, అభిషేక్ అగస్త్య, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, ఆర్డీవోలు రవి, మల్లయ్య, నేషనల్ హైవే అథారిటీ అధికారులు, స్థానిక మున్సిపల్ కమిషనర్లు, తహశీల్దార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అమోయ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని బోయిన్పల్లి నుంచి మెదక్ జిల్లాలోని కాళ్ళకల్ వరకు ఆరు లైన్లతో 27 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం పనులు నాణ్యతగా జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేలా సంబంధిత మున్సిపల్ కమిషనర్లు, తహశీల్దార్లు అవసరమైన చర్యలు తీసుకొని పనులు చేయించాలని ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించరాదని కలెక్టర్ అమోయ్ కుమార్ సమీక్ష సమావేశంలో అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులు లేనందున పనులు వేగవంతం చేసి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ అమోయ్ కుమార్ సూచించారు. ప్రస్తుతం జరిగిన సమావేశానికి సంబంధించి పనుల పురోగతిపై తదుపరి సమీక్ష సమావేశం నిర్వహించడం జరుగుతుందని అప్పటి వరకు పనులు ఏఏ దశలో ఉన్నాయనే వివరాలతో సమగ్ర సమాచారంతో ఆయా శాఖల అధికారులు హాజరు కావాలని ఈ సందర్భంగా కలెక్టర్ అమోయ్ కుమార్ ఆదేశించారు. అలాగే ఆయా మున్సిపల్ కమిషనర్లు, తహశీల్దార్లు తమ పరిధిలో పనులు జరుగుతున్న సమయంలో వెళ్ళి పర్యవేక్షించాలని సంబంధిత శాఖ అధికారులు సమన్వయంతో పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్ అమోయ్ కుమార్ సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, అభిషేక్ అగస్త్య, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, ఆర్డీవోలు రవి, మల్లయ్య, ఏసీపీ రామలింగరాజు, పోలీసు అధికారులు, ఆయా మున్సిపల్ కమిషనర్లు, తహశీల్దార్లు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.