మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రజాబలం ప్రతినిధి ఆగస్టు 4: శుక్రవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించి మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలోని , మేడ్చల్, మల్కాజిగిరి, కూకట్పల్లి, కుత్భుల్లాపూర్, ఉప్పల్, అసెంబ్లీ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. శాసనసభ నియోజకవర్గ పరిధిలో గల ఎన్నికల పోలింగ్ కేంద్రాలలో సౌకర్యాల ఏర్పాటు, పోలింగ్ కేంద్రాల షిఫ్టింగ్, నూతన పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, నూతన ఓటరు నమోదు, ఎన్నికల సందర్భంగా పొలిటికల్ పార్టీలు పాటించాల్సిన అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అమోయ్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ కేంద్రాల మార్పులు, చేర్పులు, కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి అవసరమైన ముందస్తు ప్రణాళికతో ఎటువంటిఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. 1350 కు మించి ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలలో అదనపు ఓటర్ల కోసం కొత్త పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఓటర్ల సౌలభ్యం కొరకు కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలను షిఫ్ట్ చేశామని తెలిపారు. ఈ విషయంలో అన్ని రకాల సౌకర్యాలు ఉన్న భవనాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నందున పోలింగ్ కేంద్రం ప్రాంతం (లొకేషన్) మారే అవకాశాలు ఉంటాయని ఈ విషయంలో రాజకీయ పార్టీలు సహకరించాలన్నారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాలు మారే వివరాలను కలెక్టర్ అమోయ్ కుమార్ సమావేశంలో అధికారులకు, రాజకీయ పార్టీల నాయకులకు తెలియజేశారు. అనంతరం ఆయా రాజకీయ పార్టీల నాయకులు సలహాలు, సూచనలు చేయగా కలెక్టర్ స్పందిస్తూ వారి సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకొంటామని సమావేశంలో స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారులు (ఈఆర్వో)లు ప్రతి ఒక్కరూ అన్ని పోలింగ్ కేంద్రాలను తప్పకుండా స్వయంగా వెళ్ళి పరిశీలించాల్సిందిగా కలెక్టర్ అమోయ్ కుమార్ ఆదేశించారు. ఈ విషయంలో 1 అక్టోబర్ 2023 నాటికి 18 సంవత్సరాలు నిండిన నూతన ఓటర్ కార్డు కొరకు మరియు నివాస స్థలం మార్పు, నెమ్ కరెక్షన్, ఏజ్ కరెక్షన్ లకు ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 ల ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. అలాగే ఫారమ్ – 6,7,8 లకు సంబంధించి బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్వో)ల వద్ద నుంచి స్వీకరించిన వాటిని జాగ్రత్తగా అప్లోడ్ చేయాలని ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని కలెక్టర్ అమోయ్ కుమార్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా ఓటర్ల జాబితా తయారీకి అన్ని చర్యలను పారదర్శకంగా తీసుకుంటున్నామని దీనికి అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, బూత్ లెవెల్ ఏజెంట్లు తమ సహకారాన్ని అందించి రాబోయే సార్వత్రిక ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు విజయేందర్రెడ్డి, అభిషేక్ అగస్త్య, జిల్లా రెవెన్యూ అధికారిణి హరిప్రియ, మల్కాజిగిరి, కీసర ఆర్డీవోలు శ్యామ్ ప్రకాశ్, రాజేశ్ కుమార్, బిఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, సీపీఐ, సీపీఎమ్ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు.