సీజినల్ వ్యాధులు వ్యాపించకుండా చర్యలు చేపట్టాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు
ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. శుక్రవారం సీజనల్ వ్యాధులు తీసుకోవలసిన చర్యలపై వైద్యారోగ్య, పంచాయతీరాజ్, జ్యోతిబాపూలే, కేజీబీవి, ఎస్సీ,ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు,సంక్షేమ వసతి గృహాల్లో డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా,చికెన్ గనియా వంటి వ్యాధులు వ్యాపించకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలలు, వసతి గృహాల పరిసరాల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటివరకు విద్యా సంస్థల్లో పదివేల మంది విద్యార్థులకు జ్వర సర్వేలను నిర్వహించడం జరిగిందని,ప్రక్రియను నిరంతరం కొనసాగించాలని సూచించారు.ప్రతి వసతి గృహంలో వైద్య సిబ్బంది,మందులు నిరంతరం అందుబాటులో ఉండాలని సూచించారు.దోమలు వ్యాపించకుండా నీరు నిల్వ ఉండే ప్రాంతాలలో ఆయిల్ బాల్స్, బ్లీచింగ్ పౌడర్, ఫాగింగ్,దోమల నివారణ రసాయనాల పిచికారి ప్రక్రియ నిరంతరం కొనసాగించాలన్నారు. కిటికీలకు దోమ తెరలను అమర్చుకోవాలని తెలిపారు.అన్ని వసతిగృహాలు, పాఠశాలలో ప్రతి మంగళ,శుక్రవారాల్లో డ్రైడే కార్యక్రమాలను చేపట్టాలని ఆదేశించారు. ఎంపీడీవోలు, ఎంపీపీలు, వైద్యాధికారులు సమన్వయంతో విద్యాసంస్థల్లో వ్యాధులు ప్రబలకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.వసతి గృహాల్లోని ప్రతి విద్యార్థికి రక్త పరీక్షలు నిర్వహించి,రక్తహీనత లోపం ఉన్న విద్యార్థులకు మందులు,ప్రత్యేక పోషకాహారాలు ఇవ్వాలని సూచించారు. వసతి గృహాల్లో విద్యార్థులచే పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాల్లో విష జ్వరాలకు సంబంధించి కేసులు వస్తున్న ప్రాంతాలను గుర్తించి నియంత్రణకు ప్రత్యేక చర్యలను చేపట్టాలని సూచించారు.
అనంతరం శాఖల వారీగా వసతి గృహాల లో సీజనల్ వ్యాధుల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై సంబంధిత అధికారులతో చర్చించారు. అలాగే వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా శాఖల వారిగా నిర్దేశించిన లక్ష్యాన్ని ఈ వారంలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఫైజాన్ హైమద్,జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి, జెడ్పి సీఈవో గోవింద్,డీపీవో శ్రీనివాస్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రాజేందర్,సంక్షేమ శాఖల అధికారులు, ఎంపీడీవోలు,ఎంపీ ఓలు,కేజీబీవీల ప్రత్యేక అధికారులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.