గోదావరి ఒడ్డున చెత్త చెదరాన్ని తొలగించిన ఎన్ ఎస్ ఎస్ విద్యార్థులు

జీవనదుల పరిరక్షణ అందరి బాధ్యత అని ప్రిన్సిపాల్ వెల్లడి

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 20 : పరిశుభ్రతతో కూడిన గోదావరి నదితోనే సర్వ ప్రాణులకు రక్షణ లభిస్తుందని లక్షెట్టిపేట ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జై కిషన్ ఓజా అన్నారు. బుధవారం లక్షెట్టిపేట పట్టణంలోని గోదావరి నది ఒడ్డున పేరుకుపోయిన చెత్త చెదరాన్ని కళాశాల జాతీయ సేవా పథకం (ఎన్ ఎస్ ఎస్) ప్రోగ్రాం ఆఫీసర్ కుమారస్వామి ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి తొలగించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ జై కిషన్ ఓజా మాట్లాడుతూ…పరిశుభ్రమైన నీటితోనే సకల జీవరాశుల మనుగడ సాధ్యమవుతుందన్నారు.నీటి కాలుష్యం వలన అనేక అనర్ధాలు కలిగి జీవకోటి మనుగడకు ముప్పు వాటిల్లుతుందని ఆయన వివరించారు.స్వచ్ఛమైన నీటితోనే అన్ని రకాల వృక్ష, జంతు జాతులు పరిరక్షించబడి ప్రకృతి సమతుల్యత సాధ్యమవుతుందన్నారు. ముఖ్యంగా పండుగలు, ఇతర కార్యక్రమాల నేపథ్యంలో గోదావరి ఒడ్డున చెత్త వేయడం వలన నీరు కలుషితంగా మారి మానవ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. ప్రతి ఒక్కరూ జీవ నదుల పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు ఎన్ ఎస్ ఎస్ కో -ఆర్డినేటర్,రసాయన శాస్త్ర విభాగధిపతి కుమారస్వామి మాట్లాడుతూ…గత ఐదేళ్లుగా కళాశాల విద్యార్థులతో కలిసి సేవ్ గోదావరి – క్లీన్ గోదావరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నమన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు సేవా దృక్పధం,జాతీయత అంశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు వివరించారు. సుమారు 75 మంది విద్యార్థులు, అధ్యాపక బృందం గోదావరి నది ఒడ్డున చెత్తను తొలగించారు.ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ టీ గంగయ్య,అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking