జిల్లా అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలి

ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారిద్దాం

……. జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి

సంగారెడ్డి, జనవరి 8 ప్రజ బలం ప్రతినిది:
జిల్లా అభివృద్ధికి, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి కోరారు.
జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ జయపాల్ రెడ్డి అధ్యక్షతన
జడ్పీ సమావేశ మందిరంలో జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశంలో పంచాయతీరాజ్, విద్య, వైద్యం, వ్యవసాయం నీటిపారుదల, ఉపాధి హామీ, పశుసంవర్ధకం, ఆర్ అండ్ బి, తదితర శాఖలపై చర్చ జరిగింది.
ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ఎంపీపీ లు, జడ్పిటిసిలు పలు సమస్యలను సభాముఖంగా కలెక్టర్ దృష్టికి తీసుకు వచ్చి పరిష్కరించాల్సిందిగా కోరారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సభలో తమ దృష్టికి తీసుకువచ్చిన వివిధ సమస్యలను ఆయా శాఖల అధికారులచే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా అధికారులందరూ తమ దృష్టికి వచ్చిన ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
గ్రామాభివృద్ధిలో కీలకమైన నీటి సరఫరా, పారిశుద్ధ్యం సజావుగా జరిగేలా చూడాలన్నారు. గ్రామాల్లో ఉన్న పాఠశాలలు, ఆస్పత్రులు, అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ బాగా జరగేలా పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవోలు, జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధి హామీ పనులు, ఇంజనీరింగ్ పనులు ప్రాపర్ గా జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. జిల్లా అభివృద్ధికి, ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ కోరారు.
జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజుశ్రీ జయపాల్ రెడ్డి మాట్లాడుతూ చేసే పనులకు సంబంధించి ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ సహకారం పూర్తిస్థాయిలో ఉండాలన్నారు.
సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజల అవసరాలకు సంబంధించి గత ప్రభుత్వం మంజూరు చేసిన పనులు కొనసాగించాలని, నిష్పక్షపాతంగా అన్ని నియోజకవర్గాల అభివృద్ధికి సమదృష్టితో చూడాలన్నారు.
జహీరాబాద్ శాసనసభ్యులు మాణిక్ రావు మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం అందరికీ అవసరమని, ప్రభుత్వం మారినా, అన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించి ప్రజల అభివృద్ధి సంక్షేమానికి పార్టీలకతీతంగా కలిసికట్టుగా పనిచేద్దామన్నారు.
నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ సంజీవరెడ్డి మాట్లాడుతూ ఏ సమస్యలున్న ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, ప్రారంభించిన పనులను కొనసాగిస్తారని, పార్టీలకతీతంగా ప్రజల సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు.
నర్సాపూర్ శాసనసభ్యులు సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వాలు మారవచ్చు కానీ, వ్యవస్థ కంటిన్యూయస్ ప్రాసెస్ అని, ప్రభుత్వ ప్రాధాన్యతలు మాత్రమే మారతాయని అన్నారు. ప్రజా పాలనలో స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి అర్హులకు అందించాలన్నారు. అన్ని సమస్యలను పరిష్కరించుకునే దిశగా అందరూ సమన్వయంతో కలిసి ముందుకు వెళ్లాలని అన్నారు. ఫండ్స్ అన్నది పార్టీలకతీతంగా పారదర్శకంగా కేటాయించాలని, అధికారులు భేదాభిప్రాయాలు చూపకుండా పనిచేయాలని కోరారు.
సభ ప్రారంభానికి ముందు జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్ గతంలో ప్రభుత్వం మంజూరు చేసిన పనులను కంటిన్యూ చేయాలని తీర్మానం ప్రవేశపెట్టగా,
జడ్పీ చైర్పర్సన్ ఆమోదం తెలపగా, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి బలపరిచారు.
ఈ సమావేశంలో ఎంపి బిబీ పాటిల్,అదనపు కలెక్టర్ చంద్రశేఖర్,ఎం ఎల్ సి యాదవ రెడ్డి,ఎంపీపీలు,జెడ్ పిటిసిలు,ఆయా శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking