ఎన్నికల విషయంలో అధికారులకు సూచనలు చేసిన మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్
ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా:
త్వరలో జరగబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పటిష్టమైన నిర్వహణపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా రాబోయే ఎన్నికలకు అధికారులందరూ సంసిద్దంగా ఉన్నారని ఈ విషయంలో వారితో సమావేశాలు, సమీక్షలు నిర్వహించి ఎన్నికల విధుల గురించి తెలియజేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ గౌతమ్ అన్నారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గౌతమ్ వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాలను తప్పకుండా పాటిస్తూ అధికారులకు అవసరమైన ఆదేశాలు జారీ చేస్తున్నామని ఎన్నికల విధులు నిర్వహించడంలో ఎప్పటికప్పుడు సమీక్షలు, సమావేశాలు నిర్వహించడంతో పాటు సూచనలు చేసి ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే వాటిని సరిచేయడం జరుగుతుందన్నారు. ఓటరు జాబితాను మరోసారి సమగ్రంగా పరిశీలిస్తామన్నారు. తొలగించిన ఓటర్ల వివరాలు సమగ్రంగా ఇంటింటి సర్వే చేపట్టి పరిశీలిస్తామన్నారు..డూబ్లికేట్ ఓటర్లు తొలగింప చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఓటర్ స్లిప్పులను బీఎల్వోల ద్వారా పంపిణీ చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్కు వివరించారు. అలాగే అర్హులైన ఏ ఒక్కరి పేరు కూడా జాబితా నుంచి తప్పిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటామని, ఆయా కారణాల వల్ల ఓటర్ల జాబితా నుండి తొలగించిన పేర్లను మరోమారు క్షుణ్ణంగా పరిశీలించి, పోలింగ్ స్టేషన్ వారీగా క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి, అర్హులైన వారికి ఓటు హక్కు కల్పిస్తామని వీడియో కాన్ఫరెన్స్లో వివరించారు.
అనంతరం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ… రాబోయే రోజుల్లో అన్ని ఎన్నికలను మరింత పకడ్భందీగా నిర్వహించాలని ఈఆర్వోలకు సూచించారు. ఓటరు స్లిప్పుల విషయంలో బీఎల్వోలతో సమన్వయం చేసుకుంటూ పోలింగ్ స్టేషన్లను పరిశీలించాలని, అక్కడ అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాలు సమకూర్చాలని. 1,450 ఓట్ల కంటే ఎక్కువగా ఉన్నట్లయితే ఆక్సలరి పోలింగ్ స్టేషన్ కింద అదనంగా మరో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా… అందుకు సంబంధిత అధికారులు సమాయత్తం కావాల్సిందిగా కలెక్టర్ గౌతమ్ ఆదేశించారు. ఓటరు లిస్టులో చనిపోయిన వారు ఉన్నట్లయితే వారి సంబంధీకుల వద్దకు వెళ్ళి తెలుసుకొని వారి అంగీకారంతో ఓటరు లిస్టులో నుంచి వారి పేర్లను తొలగించాలని పేర్కొన్నారు. జిల్లాలో ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన వారి ఓట్లు, మరణించిన వారి ఓట్లు, డూప్లికేట్ ఓట్లు జాబితా నుంచి తొలగించామని తొలగించిన ఓట్లకు సంబంధించి సంపూర్ణ సమాచారం అధికారుల వద్ద అందుబాటులో ఉండాలని, తొలగించిన ఓట్ల వివరాలు మరోసారి పరిశీలించి ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు అవసరమైన డాక్యుమెంట్లు ఉన్నాయో లేవో ధ్రువీకరించాలని ఆయన పేర్కొన్నారు. ఓటరు జాబితా రూపకల్పనలో బూత్ స్థాయి అధికారులు కీలకపాత్ర పోషిస్తారని,. జిల్లా వ్యాప్తంగా అన్ని ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారులు ఇప్పటి నుంచే ప్రణాళికబద్దంగా ముందుకు వెళ్ళాలని కలెక్టర్ గౌతమ్ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారిణి హరిప్రియ, ఈఆర్వోలు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.