అధికారుల తప్పిదాలతో లేని భూములకు ఆధార్ లింకు
మూడు మండలాలలో వృద్ధురాలి పేరున నమోదైన 11 ఎకరాల భూమి
ధరణిలో కానరాని భూములు “చేయూత”వెబ్ సైట్లో ప్రత్యక్షం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి నవంబర్ 13 (ప్రజాబలం ): అధికారుల నిర్లక్ష్యంతో 74 ఏండ్ల వృద్ధురాలు ఐదేండ్ల నుండి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ వృద్ధ్యాప్య పెన్షను కోసం చెప్పులరిగేలా తిరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెన్షకు మంజూరు చేసినా అందని ద్రాక్ష లా ఆమె చేతికి అందడం లేదు. అసలు తనకు పెన్షను ఎందుకు ఇవ్వడం లేదని ఏ అధికారిని అడిగినా సరైన సమాధానం లేదు. తన పేరున భూమి ఉందని అందుకే పెన్షను రాదని అధికారుల చెప్తున్న సమాధానాలు వింటూ ఆ ముసలి ప్రాణం ఆశ చావక ఇంకా ప్రభుత్వ కార్యాలయ వద్ద పడిగాపులు కాస్తుంది. నూరేళ్ళు తోడుంటాడనకున్న భర్త కాలం చేశాడు. ఆసరాగా ఉండాల్సిన కొడుకు తన కళ్ళ ముందే కాటికి వెళ్ళాడు. ఏ దిక్కూ లేని ఆ ముసలి అవ్వ కూలి పనులకు వెళ్ళడానికి శక్తి చాలక బుక్కెడు బువ్వ కోసం నానా పాట్లు పడుతుంది. ఒకవైపు గంజి నీళ్ళు దొరకక అష్ట కష్టాలూ పడుతుంటే మరోవైపు తన పేరున పదెకరాలకు పైగా పట్టా భూములు ఉన్నట్లు అధికారులు చెప్పడంతో ఏం చేయాలో ఎవరిని అడగాలో తెలియని ఆ ముసలి ప్రాణం కనబడిన వారినల్లా సహాయం చేయమని ప్రాధేయపడుతుంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం పగిడేరు గ్రామానికి చెందిన కొమరం సమ్మక్క అనే వృద్ధురాలికి 2019 లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆసరా వృద్ధాప్య పెన్షను మంజూరు చేసింది. కానీ ఆమె పేరున 11 ఎకరాలకు పైగా భూమి ఉందని చేయూత వెబ్ సైట్లో దర్షణమియ్యడం తో మంజూరు అయిన ఆ పెన్షను ను కాస్తా అధికారులు నిలిపివేశారు. పెన్షను రాకపోవడానికి అసలు కారణమేమిటో తెలుసుకున్నాక ముసలవ్వకు షాక్ కొట్టినంత పనయ్యింది. తన పేరు మీద 11 ఎకరాలకు పైగా భూమి ఎక్కడనుండి వచ్చిందో అర్ధం కాక ఆ వివరాలు తొలగించాలని గ్రామ సర్పంచ్ దగ్గర నుండి ఎంపీడీఓ వరకు కనబడిన వారినందరినీ ప్రాధేయపడుతుంది. చివరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మానవ హక్కుల కార్యకర్త అయిన గంగాధర కిశోర్ కుమార్ ఆ వృద్ధురాలు తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో దీనంగా వచ్చే పోయే అధికారులను చూస్తూ అక్కడక్కడే తచ్చాడుతుండడం గమనించి విషయం ఏమిటని ఆరా తీస్తే వృద్ధురాలు ఐదేండ్ల నుండి పెన్షను కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసింది. ఆమె దరఖాస్తు తీసుకుని పరిశీలిస్తే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2019 లో ఇచ్చిన ఆసరా పెన్షను గుర్తింపు కార్డు కనబడింది. మణుగూరు ఎంపీడీఓ కార్యాలయంలో వృద్ధురాలి కి పెన్షను రాకపోవడానికి కారణం తెలుసుకుంటే పంచాయతీ రాజ్ శాఖ వారి చేయూత వెబ్ సైట్లో ఈ వృద్ధురాలి పేరున మూడు వేరు వేరు టి. నంబర్లలో సుమారు 11ఎకరాలకు పైగా విస్తీర్ణం గల భూమి ఉన్నట్లు రిమార్క్స్ లో ఎంటర్ చేయబడింది. కానీ కొమరం సమ్మక్క అనే వృద్ధురాలి తన పేరున ఎలాంటి భూములు లేవని తేల్చి చెప్పింది. ఈ వివరాలను మణుగూరు ఎంపీడీఓ స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి పంపగా ధరణి వెబ్ సైట్లో ఈ వివరాలు కొమరం సమ్మక్క వివరాలతో సరిపోలలేదు.
ధరణిలో లేకున్నా చేయుత వెబ్ సైట్లో వృద్ధురాలి పేరున మూడు మండలాల్లో భూములు
పంచాయతీ రాజ్ శాఖ వారు నిర్వహిస్తున్న చేయూత వెబ్ సైట్లో కొమరం సమ్మక్క పేరున మూడు వేరు వేరు టి. నంబర్లలో సుమారు 11 ఎకరాలకు పైగా విస్తీర్ణం గల భూమి ఉన్నట్లు రిమార్క్స్ లో ఎంటర్ చేసారు. మూడు టి. నంబర్ల గురించి విచారిస్తే ప్రభుత్వ యంత్రాంగాల సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనబడుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాక మణుగూరు మరియు కరకగూడెం మండలాల్లోని మూడు రెవెన్యూ గ్రామాలలోని భూములు కొమరం సమ్మక్క పేరున చేయూత వెబ్ సైట్లో కనబడుతున్నాయి. కానీ కొమరం సమ్మక్క ఆధార్ నంబరు ఇతర వివరాలతో ధరణి వెబ్ సైట్లో సెంటు భూమి కూడా లేదు. కొమరం సమ్మక పేరున ధరణిలో లేని భూములు పంచాయతీ రాజ్ శాఖ వారు నిర్వహిస్తున్న చేయూత వెబ్ సైట్లోకి ఎలా వచ్చాయన్న ప్రశ్నకు అధికారుల వద్ద సమాధానం లేదు. పినపాక మండలం పొట్లపల్లి రెవెన్యూ గ్రామంలో టి.27200180003 నంబరు మీద 2.36 ఎకరాల భూమి కొమరం రామయ్య సన్నాఫ్ రామచంద్రయ్య పేరున నమోదు చేయబడి ఉంది. మణుగూరు మండలం రామనూజవరం రెవెన్యూ గ్రామంలో టి.27170010423 నంబరు మీద 2.36 ఎకరాల భూమి కొమరం సారమ్మ వైఫ్ ఆఫ్ ముసలయ్య పేరున ఉండగా కరకగూడెం మండలం రేగల్ల రెవెన్యూ గ్రామంలో టి.27140090105 నంబరు మీద 5.32 ఎకరాల భూమి కొమరం సమ్మక్క వైఫ్ ఆఫ్ సూరయ్య పేరున నమోదు చేయబడి ఉంది. ఐతే కనీసం ఆధార్ కార్డుతో కూడా అనుసంధానం కానీ అసలు సంబంధమే లేని భూములు పంచాయతీ రాజ్ శాఖ వారు నిర్వహిస్తున్న చేయూత వెబ్ సైట్లో కొమరం సమ్మక్క పేరున ఎవరు ఎంటర్ చేసారు అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.
నెల రోజులు గడిచినా ప్రజావాణి దరఖాస్తు పెండింగులోనే
బువ్వ పెట్టే దిక్కులేక కోడలు పంచన కాలం వెళ్ళ బుచ్చుతున్న కొమరం సమ్మక్క 74 ఏండ్ల ముదిమి వయసులో అధికారుల చుట్టూ తిరుగుతూ పెన్షను కోసం అలుపెరుగని పోరాటం చేస్తుంది. ఎక్కడివో కూడా తెలియని భూములు తన పేరున ఎలా వచ్చాయో వాటిని తొలగించి తనకు పెన్షను ఎవరు ఇప్పిస్తారో అని ఆశగా చూస్తుంది. జీవిత చరమాంకంలో మనవళ్ళు మనవరాళ్ళతో హాయిగా గడపాల్సిన ఆ వృద్ధురాలి దీనస్థితి గమనించి మానవ హక్కుల కార్యకర్త జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ప్రజావాణి ద్వారా సమస్యకు పరిష్కారం చూపల్సిందిగా దరఖాస్తు చేశాడు. కలెక్టర్ పెషీ నుండి డిఆర్ డిఎ కార్యాలయానికి అక్కడ నుండి ప్రస్తుతం మణుగూరు ఎంపీడీఓ కార్యాలయనికి ప్రజావాణి దరఖాస్తు వచ్చింది. అయినా ఇంకా అధికారులు వృద్ధురాలి సమస్యను పరిష్కరించలేదు. 74 ఏండ్ల ముదిమి వయసులో ఒక వృద్ధురాలు పెన్షను డబ్బుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయడం చూస్తూంటే ప్రభుత్వాధికారుల నిర్లక్ష్యం ప్రభుత్వ యంత్రాంగాల సమన్వయం లోపం కళ్ళకు కట్టినట్లు కనబడుతుంది. ఇప్పటికైనా అధికారులు ఆ పండుటాకు బాధను చూసి పెన్షను ఇప్పిస్తే ఆమెకు న్యాయం చేసినవారవుతారు.