డబుల్ బెడ్రూమ్లు పొందిన ప్రతి ఒక్కరూ అదృష్టవంతులు,
రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రతినిధి (ప్రజాబలం) 5అక్టోబర్:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కలను సాకారం చేసే దిశగా ముందుకు వెళ్తోందని ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు మేలు చేయాలని కృతనిశ్చయంతో అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపట్టారని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
గురువారం మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మురహరిపల్లిలో ముషీరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాలకు చెందిన డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు వారికి కేటాయించిన ఇళ్ళను ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్తో కలిసి ర్యాండమైజేషన్ సాఫ్ట్ వేర్ ను ఉపయోగించి లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి సొంతింటిని నిర్మించి ఇవ్వడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లను అందచేస్తున్నారని తెలిపారు. ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన 1,188 మంది లబ్ధిదారులకు, సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన 1,188 మంది లబ్ధిదారులకు ఈ ప్రాంతంలో అధునాతన సౌకర్యాలతో నిర్మించిన డబుల్ బెడ్రూమ్లను పంపిణీ చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ పంపిణీలో అర్హులైన వారికి అందచేస్తోందని దీనిలో ఆన్లైన్ విధానం ద్వారా ఇళ్ళు, ఫ్లోర్ల కేటాయింపులు ఎలాంటి అవకతవకలు, రాజకీయాలు, పైరవీలకు తావు లేకుండా నిష్పక్షపాతంగా అర్హులైన లబ్ధిదారులను ర్యాండమైజేషన్ ద్వారా ఎంపిక చేయడంలో అధికారుల కృషి ఎంతో ఉందని మంత్రి మల్లారెడ్డి వివరించారు. డబుల్ బెడ్రూమ్ల పంపిణీ విషయంలో కొంత ఆలస్యమైనప్పటికీ లిఫ్ట్, నీటి సదుపాయంతో పాటు అన్ని రకాల అత్యంత అధునాతన సౌకర్యాలతో వీటిని అందచేయడం జరుగుతుందని తెలిపారు. ఈ ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్లు పొందిన ప్రతి ఒక్కరూ ఎంతో అదృష్టవంతులని ఈ ప్రాంతానికి దగ్గరలోనే షామీర్పేట జాతీయ రహదారి ఉండటంతో పాటు ప్రపంచ దేశాలకు కరోనా సమయంలో టీకాలు అందించిన జీనోవ్ వ్యాలీ ఉందన్నారు. ప్రస్తుతం మురహరిపల్లిలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు బంజారాహిల్స్, హైటెక్సిటీలలో ఉన్న ఇళ్ళ కంటే ఎంతో బాగున్నాయని… ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నాయని మంత్రి మల్లారెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణా రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేపట్టే ప్రతి అభివృద్ధి కార్యక్రమం చరిత్ర సృష్టించేదిగా ఉంటుందని అలాంటి ముఖ్యమంత్రి దేశంలో లేరని మంత్రి అన్నారు. ప్రతినిత్యం ప్రజల సంక్షేమం కోసం ఆలోచిస్తూ వారికై అనేక పథకాలు అందచేస్తూ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంచారని సమావేశంలో మంత్రి మల్లారెడ్డి కొనియాడారు. దీంతో పాటు రాష్ట్రానికి, మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాకు అనేక రకాల ఐటీ కంపెనీలు రావడంలో మంత్రి కేటీఆర్ కృషి ఎంతో ఉందని ప్రతి ఒక్కరికీ ఉద్యోగాలు లభించేలా ఆయా కంపెనీలు రావడం వల్ల అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.
ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్లను తన నియోజకవర్గానికి చెందిన అర్హులైన లబ్ధిదారులకు అందచేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ విషయంలో అన్ని రకాల అత్యాధునిక సౌకర్యాలతో వీటిని నిర్మించారని అన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి ర్యాండమైజేషన్ పత్రాలను అందచేసి వారి సొంత ఇంటి కల నిజం చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రభుత్వానికి దక్కుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీడబ్ల్యువో కృష్ణ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.