వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు సమర్థవంతంగా నిర్వహించాలి
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి అక్టోబర్ 08:
2024-25 సంవత్సరానికి గాను ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.మంగళవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సబావత్ మోతిలాల్,జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్,జిల్లా పౌరసరఫరాల అధికారి బ్రహ్మారావు, జిల్లా మేనేజర్ శ్రీకళ తో కలిసి కొనుగోలు కేంద్రాల నిర్వహణపై కొనుగోలు కేంద్రాల కమిటీ సభ్యులు, ఎ.పి.ఎం.,సి.సి.లు,బుక్ కీపర్ లకు లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… వానాకాలం వరి ధాన్యం కొనుగోలు కొరకు ఏర్పాటు చేయనున్న కొనుగోలు కేంద్రాల నిర్వహణ సమర్థవంతంగా ఉండాలని అన్నారు.రైతులకు ఏ రకం ధాన్యం క్వింటాల్ కు 2 వేల 320 రూపాయలు, సాధారణ రకానికి 2 వేల 300 రూపాయల మద్దతు ధర చెల్లించడం జరుగుతుందని,ధాన్యం కొనుగోలు సమయంలో తప్పనిసరిగా నాణ్యత ప్రమాణాలు పాటించాలని తెలిపారు.వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో టార్పాలిన్లు, మాయిశ్చర్ మీటర్,ఎలక్ట్రానిక్ వేయింగ్ యంత్రం తప్పనిసరిగా ఉండాలని,రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా త్రాగు నీరు,నీడ,కుర్చీలు మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలిపారు. రైతులు వారి పరిధిలోని వ్యవసాయ అధికారి, వ్యవసాయ విస్తరణ అధికారి వద్ద నుండి ధ్రువీకరణ పత్రం తీసుకొని రావాలని, ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు.సన్న రకం ధాన్యానికి ప్రభుత్వం 500 రూపాయల బోనస్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.కొనుగోలు నమోదు పుస్తకము, రిజిష్టర్ లను కచ్చితంగా నిర్వహించాలని, నిబంధనల మేరకు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసిన వెంటనే రైతులకు రశీదు జారీ చేయాలని,కొనుగోలు చేయు సమయంలోనే టాబ్ ఎంట్రీ చేయాలని తెలిపారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు నిబంధనలు తప్పక పాటించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.