– అక్రమ అరెస్టులను వెంటనే ఆపి, ఉపాను రద్దు చేయాలి
-సి.ఎల్.సి. నేతలు ప్రొఫెసర్ లక్ష్మణ్, నారాయణ డిమాండ్
హైదరాబాద్ మార్చ్ 21 :ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ములుగు వెంకటాపురం పోలీసులు విచ్చలవిడిగా రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ప్రజా సంఘాల నేతలను అక్రమ అరెస్టులకు గురిచేయడాన్ని తెలంగాణ పౌరహక్కుల సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్షులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి ఎన్.నారాయణ రావు, హైదరాబాద్ నగర అధ్యక్షులు సినింరాజు మంగళవారం ఏర్పాటు చేసిన పత్రిక విలేకరుల సమావేశంలో తీవ్రంగా ఖండించారు. ఈనెల 19, 20 తేదీలలో తెలంగాణ పోలీసులు ప్రజా సంఘాల కార్యకర్తల ఇళ్ళమీద దాడిచేసి, 8 మందిని అరెస్టు చేసి, మరో 7 గురిని తప్పించుకు తిరుగుతున్నారని ఆరోపించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని అన్నారు. అరెస్టు సమయంలో పోలీసులు చట్టబద్ద పద్దతులను అనుసరించవలసి ఉండగా, అందుకు విరుద్ధంగా వ్యవహరించడాన్ని తప్పు పట్టారు. కొంతమందిని దారిలోనే అరెస్టుచేసి కుటుంబ సభ్యలకు తెలియజేయక పోవడమే గాక అరెస్టు వారెంటుగాని, కనీసం మెమోగాని అందజేయలేదని గుర్తుచేశారు. ఈ నెల 20 న హైదరాబాద్, దమ్మాయిగూడ, బాలాజీనగరులో నివాసం ఉంటున్న ఘనపురం చంద్రమౌళి(53)ను ఉదయం 11 గంటలకు మఫ్టిలో ఇద్దరు, యూనిఫాంలో మరో ఇద్దరు పోలీసులు ఇంట్లోకి చొరబడి చంద్రమౌళిని బలవంతంగా ఎత్తుకుపోయారని అన్నారు. కుటుంబీకులను భయాందోళనకు గురిచేసి, దారిలో ఇంటికి వస్తున్న అతని కుమారుడు ప్రుద్వీరాజ్ న్యాయశాస్త్ర విద్యను అభ్యసిస్తున్న విద్యార్థి అని తెలియజేశారు. ఇతనకు ఏ ఉద్యమాలతో ఎలాంటి సంబంధాలు లేవని, తండ్రి చంద్రమౌళి ప్రజాస్వామ్య బద్దంగా బహిరంగంగా ప్రజాతంత్ర దేశభక్త ఉద్యమ్యానికి అధ్యక్షులుగా గత 20 సంవత్సరాలుగా నాయకత్వం వహిస్తున్న వ్యక్తి అని ప్రొఫెసర్ లక్ష్మణ్ గుర్తు చేశారు. ఈనెల 23 న భగత్ సింగ్ వర్ధంతి సభలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే క్రమంలో 19 న అందె రవి, శ్రీ రామోజు మనోజు, దిడ్డి సత్యం, శ్రీ రామోజు భిక్షపతి, అనసూరి రాంబాబు, అందె మానసలను అక్రమ అరెస్టుకు గురిచేసి అప్రజాస్వామిక చట్టం ‘ఉపా’ సెక్షన్లను నమోదు చేయడం దుర్మార్గమైన చర్య అని ఎన్. నారాయణ రావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం యువకులను, ప్రజలను, విద్యార్థులను, మహిళలను ప్రశాంతంగా తమ మనుగడను కొనసాగనివ్వడం లేదని సినింరాజు తన ఆందోళనను వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే సుమారు 200 మందికి పైగా ఉపా కేసులు ప్రయోగించి, 65 మందిని జైలుపాలు చేసి మానసిక, శారీరక ఆందోళనలకు గురిచేశారని అన్నారు. ‘లా’ చదువుతున్న విద్యార్థులను గతంలోనే కిషోర్, గోపిలను అరెస్టు చేసి జైలుకు పంపారని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును చిద్రం చేసే హక్కు పాలకులకు ఎవరిచ్చారని తెలంగాణ కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. అరెస్ట్ అయిన ప్రతిఒకరికి మావోయిస్టులతో సంబందాలు ఉన్నాయనే పేరిట చేస్తున్న ఆరోపణలు పచ్చి అబద్దాలని ఎండగట్టారు. ప్రజలను, ఉద్యమ కారులను కేవలం భయకంపితులను చేయడంకోసం మరియు ప్రజాతంత్ర ఉద్యమాల గొంతులు నొక్కడం కోసం అస్పష్టమైన ఆరోపణలకు తెలంగాణ పోలీసులు దిగారని అన్నారు. ఇప్పుడు అరెస్టు చేసిన 8 మందికి కాని, తప్పించుకు తిరుగూతున్నారని ఆరోపిస్తున్న 7 మందికి గాని మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని గట్టిగా నిరూపించేందుకు సాక్ష్యాలు పోలుసుల దగ్గర ఉన్నాయా? అనేది కోర్టులో తేలాల్సిన అంశం అని స్పష్టం చేశారు. కేవలం ఆరోపణలతో జైళ్ళో నిర్భందించే వైనాన్ని వెంటనే మానుకోవాలని సూచించారు.