మలేరియా నిర్మూలనలో ప్రజలు భాగస్వాములు కావాలి.

 

ఎల్లారెడ్డిపేట పి హెచ్ సి ఆవరణలో మలేరియా దినోత్సవం లో పాల్గొన్న కలెక్టర్.

రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, ఎల్లారెడ్డిపేట, ( ప్రజాబలం), రాజన్న సిరిసిల్ల జిల్లాలో మలేరియాను సమూలంగా నిర్మూలించే ప్రక్రియలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ పిలుపునిచ్చారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా మలేరియా నిర్మూలనపై ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ హాజరై, అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మలేరియా వ్యాప్తి, వ్యాధి నిర్ధారణ, వైద్య సదుపాయం, వైద్యం అందించే విధానం తదితర అంశాలపై క్లుప్తంగా వివరించారు. జిల్లాలో గత ఏడాది మలేరియా కేసులు నమోదు కాలేదని తెలిపారు. దీనిలో భాగస్వాములైన వైద్యులు, సిబ్బంది, పంచాయితీ రాజ్, మున్సిపల్ అధికారులు, సిబ్బందిని అభినందించారు. రానున్న రోజులలో కూడా ప్రతి ఒక్కరు సమన్వయంతో పని చేస్తూ ఇవే ఫలితాలు వచ్చేలా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
వైద్యులు, సిబ్బంది తమ పరిధిలోని వార్డులు, గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. దోమతెరలు వాడాలని, దోమలు కుట్టకుండా చూసుకోవాలని తదితర అంశాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. పంచాయతీ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది తమ పరిధిలోని ప్రాంతాల్లో మురుగు కాలువలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, ఎక్కడైనా మురుగునీరు నిలిస్తే బ్లీచింగ్ పౌడర్ వేసి, ఆయిల్ బాల్స్ వేయాలని దోమల నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని అన్ని ఆసుపత్రులలో మలేరియా నిర్ధారణ కిట్లు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. వైద్యులు, సిబ్బంది మలేరియా లక్షణాలు ఉన్నవారికి నిర్ధారణ పరీక్షలు చేయాలని వారికి సరియైన వైద్యం అందించాలని సూచించారు. ప్రజలు కూడా తమ పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని పేర్కొన్నారు. దీంతో వ్యాధుల వ్యాప్తి తగ్గుతుందని స్పష్టం చేశారు. వైద్యులు, సిబ్బంది తమ ఇల్లు, పరిసరాలు ఎంత శుభ్రంగా ఉంచుకుంటారో, ప్రజలు కూడా అలాగే తమ ఇల్లు పరిసరాలు శుభ్రంగా ఉంచుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత, ప్రోగ్రాం ఆఫీసర్ అనిత, మెడికల్ ఆఫీసర్ ప్రదీప్, పీహెచ్సీ డాక్టర్ సయ్యద్ సాయిరా అంజు మ్, డాక్టర్లు, ఆశా కార్యకర్తలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking