రైతులు కోరుకుంటే లైసెన్స్డ సర్వేయర్ల ద్వారా భూ సర్వే
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరు గౌతం
ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఏప్రిల్ 25: భూభారతితో రైతుల, భూస్వాముల భూసమస్యలు తీర్చే అధికారం రెవెన్యూ అధికారులకు ఈ చట్టంలో ఇవ్వడం జరిగిందని, తద్వారా సమస్యలకు రెవెన్యూ అధికారులు శాశ్వత పరిష్కారం కల్పిస్తారని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరు గౌతం అన్నారు.
శుక్రవారం ఘట్కేసర్ మండలంలోని ఎదులాబాదు గ్రామంలో గల డిఎస్ఆర్ ఫంక్షన్ హాలు లో ఏర్పాటు చేసిన అవగాహాన సదస్సుకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరు గౌతం ముఖ్య అతిథిగా విచ్చేసారు.ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ భూభారతితో రైతుల, భూస్వాముల భూ సమస్యలు తీర్చే అధికారం రెవెన్యూ అధికారులకు ఈ చట్టంలో ఇవ్వడం జరిగిందని, తద్వారా సమస్యలకు రెవెన్యూ అధికారులు శాశ్వత పరిష్కారం కల్పిస్తారని అన్నారు. ప్రతి గ్రామంలో తహాసీల్దారు రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం జరగుతుందని ఆ సదస్సులో మీయొక్క వ్యక్తిగత భూసమస్యలకు సంబంధించిన అప్లికేషన్లు ఇస్తే అన్ని సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ధరణిలోరెవెన్యూ డిపార్ట్ మెంట్ కు ఎలాంటి అధికారాలు కల్పించనందున, ఇప్పటివరకు ఆ సమస్యలన్ని అధిక సంఖ్యలో అలాగే పెండింగ్ లో ఉన్నాయన్నారు. భూభారతి ద్వారా ఆ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. పాసు బుక్కులు రాని వారికి కొత్త పాసు పుస్తకాలు ఇవ్వడం , అలాగే పాసుబుక్కులలో తప్పులను సవరించడం ఈ భూభారతి చట్టం ద్వారా చేయవచ్చని తప్పనిసరిగా రైతుల సమస్యలు తీరుస్తామని కలెక్టరు అన్నారు. రైతులు కోరుకుంటే లైసెన్స్డ సర్వేయర్ల ద్వారా సర్వే చేయించి భౌతిక సరిహద్దుతో చేయించిన ల్యాండ్ మ్యాపులను ప్రభుత్వ సర్వేయర్లు మళ్లీ వాలిడేట్ చేసిన తరువాతే మీకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లలో ల్యాండ్ మ్యాపులు వస్తాయని, దీని వల్ల ఎవరికి నష్టం జరగదని ఇంకా పకడ్బందీగా మీ భూసరిహద్దులు ఉంటాయని, అది కూడా రైతు ఒప్పుకుంటేనే భూ సర్వే చేస్తామని కలెక్టరు తెలిపారు. ధరణి వల్ల పిఒబి సమస్యలు చాలా ఉన్నాయని, భూభారతి చట్టంలో పిఓబి రద్దుచేసే అధికారం కల్పించడం జరిగిందన్నారు.ఈ భూభారతి చట్టంలో ప్ర్రతి సంవత్సరం డిసంబర్ 31న ఆ సంవత్సరంలో జరిగిన మార్పులు, చేర్పులను ఆన్ లైన్ లో ప్రింట్ తీసి ప్రతి గ్రామ పంచాయతీ నోటీసు బోర్డులలో ప్రదర్శిస్తారని అందువల్ల మీకందరికి మీమీ భూముల రికార్డుల వివరాలు తప్పక తెలుస్తాయని కలెక్టరు వివరించారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టరు మాట్లాడుతూ భూభారతి చట్టం ద్వారా రెవెన్యూ అధికారుల పై బాధ్యత మరింత పెరిగిందన్నారు. ప్రభుత్వం అనేక కొత్త అంశాలను పొందుపరుస్తూ ఈ నూతన ఆర్.ఓ.ఆర్ చట్టాన్ని తెచ్చిందని, ధరణి స్థానంలో కొత్తగా భూ భారతి వ్యవస్థను అమలు చేస్తున్నట్లు తెలిపారు. భూ సమస్యల పరిష్కారానికి రెండు అంచెల అప్పీల్ వ్యవస్థ రైతులకు న్యాయబద్ధమైన మార్గం కల్పిస్తోందని తెలిపారు. ఇంటి స్థలాలు, ఆబాది, వ్యవసాయేతర భూములకు హక్కుల రికార్డులతో వ్యవస్థను సమగ్రంగా అభివృద్ధి చేయడంతో పాటు, భవిష్యత్తులో పేద రైతులకు ఉచిత న్యాయ సహాయం అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని అదనపు కలెక్టరు తెలిపారు.
ఈ సదస్సులో కీసర ఆర్డిఓ ఉపేందర్ రెడ్డి, ఘట్కేసర్ తహాసీల్దారు రజనీ, రెవెన్యూ అధికారులు, సిబ్బంది, రైతులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.