ప్రజా ప్రభుత్వంలో దశలవారీగా అభివృద్ధి పనులు

– మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సలహాలు అవసరం లేదు
– కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు వినోద్‌కుమార్‌

ప్రజా ప్రభుత్వంలో ఉమ్మడి జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి ఎస్‌.వినోద్‌కుమార్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తన హయాంలో మినీ ట్యాంక్‌బండ్ పనులు, అండర్‌ డ్రైనేజీ కోసం రూ.250 కోట్లు తెచ్చిన, మన్యంకొండ వద్ద రోప్‌వే కోసం టెండర్లు అయ్యాయని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎన్నికల సమయంలో జేఎన్‌టీయూ వచ్చిందని హడావిడి చేశారని, మరి ఆ జీవో ఎక్కడుందని ప్రశ్నించారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో పీయూకు లా, ఇంజనీరింగ్‌ కళాశాలలు మంజూరు అయ్యాయని, యూనివర్సిటీ అభివృద్ధికి రూ.100 కోట్లు తీసుకురావడం జరిగిందన్నారు. మాజీ మంత్రి హయాంలో కేవలం శిలాఫలాలకే పరిమితమయ్యారని, కాని కాంగ్రెస్‌ ప్రభుత్వం దశలవారీగా అభివృద్ధి పనులు చేస్తున్నట్లు తెలిపారు. మాజీ మంత్రి సలహాలు, సూచనలు మా ప్రభుత్వానికి అవసరం లేదన్నారు. మరో సీనియర్‌ నాయకుడు ఎన్‌పీ.వెంకటేశ్‌ మాట్లాడుతూ బీసీల గురించి మాట్లాడే అర్హత మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు లేదని విమర్శించారు. వైఎస్‌ఆర్‌ హయాంలో 34 శాతం బీసీ రిజర్వేషన్లు ఉంటే కేసీఆర్‌ వచ్చిన తర్వాత 23 శాతం చేసినప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కులగణన చేపట్టి 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించడం జరిగిందన్నారు. మాజీ మంత్రి మాటలకు ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవాచేశారు. మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ ఆనంద్‌కుమార్‌గౌడ్‌ మాట్లాడుతూ ఎమ్మెల్యే నాయకత్వంలో కార్పొరేషన్‌లోని అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు తెలిపారు. రానున్న ఎన్నికల దృష్టిలో పెట్టుకొని మాజీ మంత్రి రాజకీయ లబ్ధికోసం కోసం మాట్లాడుతున్నారని ఆరోపించారు. సమావేశంలో ముడా చైర్మన్‌ లక్ష్మణ్‌యాదవ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ మల్లు నర్సింహారెడ్డి, మీడియాసెల్‌ కన్వీనర్‌ సీజే బెనహర్, నాయకులు అజ్మత్‌అలీ, ఫయాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking