139వ ” మే డే ” రోజున హమాలీ కార్మిక సంఘం కార్యాలయం ఎదుట జండా ఆవిష్కరించిన పొలాస. నరేందర్.

కార్మికుల కనీస వేతన సవరణ చట్టాలను, చట్టబద్ధంగా, శాస్త్రీయంగా, సంపూర్ణంగా, పటిష్టవంతంగా ప్రభుత్వాలు అమలు చేయాలి.

సంఘటిత, అసంఘటిత కార్మికుల సంక్షేమంపై అమలు చేస్తున్న పాత చట్టాలను పక్కకు పెట్టి కొత్త చట్టాలను అమలు చేయాలి.

వేతన సవరణలో జాప్యంతో కార్మికులు శ్రమ దోపిడీకి గురి అవుతున్నారు.

వేములవాడ టౌన్, ( ప్రజాబలం ), 139 ఏండ్ల ” మే డే ” అంతర్జాతీయ కార్మిక దినోత్సవం శుభ సందర్భంగా వేములవాడ పట్టణంలోని రెండవ బైపాస్ రోడ్డులోని మండల హమాలి కార్మిక కార్యాలయం ఎదుట మండల కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు పోలాస నరేందర్ మే డే పథకాన్ని ఆవిష్కరించారు. పతాకావిష్కరణ అనంతరం జరిగిన సమావేశంలో కార్మికులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ అమెరికాలోని చికాగో పట్టణంలో కార్మికులు 18 గంటల పని దినాలను వ్యతిరేకిస్తూ, ఎనిమిది గంటల పని కావాలని జరిపిన ప్రదర్శన పై అమెరికన్ పోలీసులు జరిపిన కాల్పులలో 8 మంది కార్మికులు బలైనారని, చికాగో కార్మికులు ఉద్యమించిన రోజున అంతర్జాతీయ మే డే దినోత్సవాన్ని కార్మికులు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. సంఘటిత, అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన చట్టాలు, చట్టబద్ధంగా, సంపూర్ణంగా, శాస్త్రీయంగా, పటిష్టవంతంగా అమలు జరగడం లేదని, నిబంధనల ప్రకారం ఐదు సంవత్సరములకు ఒక మారు సవరణ జరగాల్సి ఉన్న కార్మికుల చట్టాలను సవరణ చేయకుండా పాత చట్టాలనే అమలు చేస్తున్నారని, పాత కార్మిక చట్టాలకు స్వస్తి చెప్పి కొత్త చట్టాలను చట్టపరంగా, శాస్త్రీయంగా అమలు చేసి సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులకు న్యాయం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఐదు సంవత్సరములకు ఒక మారు తప్పనిసరిగా కనీస వేతన సవరణను ఖరారు చేయాలని కార్మిక చట్టాలు ఉన్నప్పటికీ కొత్త చట్టాలను ఏర్పాటు చేయకుండా, ప్రభుత్వాలు పాత చట్టాలనే అమలు చేస్తూ కాలయాపన చేయడం చాలా బాధాకరమని నరేందర్ తన ఆవేదన వ్యక్తపరిచారు. పెరుగుతున్న జీవన ప్రమాణాలు, మార్కెట్లో రోజురోజుకు పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలు, విద్య, వైద్యం అత్యంత కీలకం కావడం అవి ఖరీదు కావడంతో సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులు చాలీచాలని వేతనాలతో దుర్భర జీవనాన్ని సాగిస్తున్నారని నరేందర్ మనోవేదన చెందారు. రెక్కలు ముక్కలు చేసుకుని, ఎంతో శ్రమపడినప్పటికి, శ్రమను చమటగా మార్చినప్పటికీ మంచి జీవనాన్ని కొన సాగించలేకపోతున్నారని, కార్మికుల పిల్లల భవిష్యత్తుకు మంచి విద్యను, వైద్యాన్ని అందించలేకపోతున్నారని కార్మికులు నిరాశ, నిస్పృహకు లోన్ అవుతున్నారని, వెంటనే పాత కార్మిక చట్టాలకు స్వస్తి చెప్పి, కొత్త చట్టాలను అమలు చేయాలని, అలాగే నిరుపేద కార్మికులకు ఉపాధి, నివేషణ స్థలాలను, ఇందిరమ్మ ఇండ్లను, పెన్షన్లను తక్షణం మంజూరు చేసి కార్మికులను ఆదుకోవాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను నరేందర్ కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు గజ్జల శేఖర్, ప్రధాన కార్యదర్శి గుండం బాలయ్య, సంఘం నాయకులు లింగాపురం పోచమల్లు, బేగిని కిషన్, వేల్పుల ఎల్లయ్య, బొడ్డు శేఖర్, చంద్రగిరి నందయ్య, గుండం దాసు, అంగులూరి గుణ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking