0-5 సంవత్సరాల లోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజాన్ని నిర్మించాలి
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ తెలిపారు
ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఫిబ్రవరి 19:
సోమవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ విసి హాల్ లో ఏర్పాటుచేసిన జిల్లా టాస్క్ ఫోర్స్ సమన్వయ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 3వ తేదీన బూత్ స్థాయి లో పోలియో చుక్కలు వేయడం జరుగుతుందన్నారు. 4 నుండి 6 తేదీ వరకు ఇంటి ఇంటికీ వెళ్లి ఆశావర్కర్లు పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని తెలిపారు. పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. హై రిస్క్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. హై రిస్క్ ప్రాంతాలైన మురికివాడలు, సంచార జాతులు, ఇటుక బట్టీలు, నిర్మాణ స్థలాలలో నివసిస్తున్న ప్రాంతాలను గుర్తించి అక్కడ పోలియో బూతులను ఏర్పాటు చేయాలని కలెక్టర్ తెలిపారు. అంగన్వాడి కేంద్రాలలో పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. పల్స్ పోలియో చుక్కలు వేసేందుకు విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. 5 సంవత్సరాల లోపు చిన్నారులందరికీ పల్స్ పోలియో చుక్కలు వేసేలా చూడాలన్నారు. చిన్నారులకు పోలియో వ్యాధి సోకకుండా ఉండేందుకు ప్రభుత్వం చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమం లో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని అన్నారు. ప్రసార మాధ్యమాల ద్వారా కూడా విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. విద్యాశాఖ అధికారులు విద్యార్థులతో పోలియో మీద ర్యాలీలు నిర్వహించాలని అన్నారు. జిహెచ్ఎంసి పరిధిలోని మున్సిపల్ కమిషనర్ ల సహాయంతో పోలియో చుక్కలు వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. మసీదు, దేవాలయాలలో, సినిమా ధియేటర్లలో, రైల్వేస్టేషన్లలో, పోలియో చుక్కల గురించి అనౌన్స్ చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య అధికారి రఘునాథ స్వామి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి సరస్వతి, శిశు సంక్షేమ అధికారి కృష్ణారెడ్డి,
వైద్యాధికారులు, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్లు , సంబంధిత అధికారులు పాల్గొన్నారు.