పది రోజుల క్రితం మగ శిశువు మృతి.
కరీంనగర్ లోని రెండు ప్రైవేటు ఆసుపత్రులపై తల్లిదండ్రుల ఫిర్యాదు.
వేములవాడ రూరల్ మండలం మెజిస్ట్రేట్ సమక్షంలో చిన్నారి మృతదేహం వెలికి తీసి, పోస్టుమార్టం.
వేములవాడ టౌన్, ( ప్రజా బలం ), రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం ఫాజుల్ నగర్ గ్రామానికి చెందిన గండి గీతాంజలి – రాజశేఖర్ దంపతులకు మార్చి నెల 18వ తేదీన కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మగ బిడ్డకు జన్మనిచ్చారు. అయితే పుట్టిన తర్వాత శిశు ఆరోగ్యం నిలకడగా లేకపోవడంతో వెంటనే మరో ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ కూడా చిన్నారి పరిస్థితి విషమించడంతో హైదరాబాదులోని నీలోఫర్ ఆస్పత్రికి తరలించిన తర్వాత గంటల వ్యవధిలో చిన్నారి మృతి చెందాడని దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తమ చిన్నారి మృతికి కరీంనగర్ లోని రెండు ప్రైవేటు ఆసుపత్రులు కారణమంటూ కరీంనగర్ పట్టణంలోని రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు బుధవారం రోజున కరీంనగర్ లోని రెండవ పట్టణ ఎస్సైలు చంద్రశేఖర్, దీపక్ కుమార్ చిన్నారిని పూడ్చిపెట్టిన వేములవాడ రూరల్ మండలం ఫాజుల్ నగర్ గ్రామానికి చేరుకొని పంచనామ నిర్వహించారు. చిన్నారిని ఖననం చేసిన మృతదేహాన్ని వేములవాడ రూరల్ మండలం మెజిస్ట్రేట్ అబూబకర్ సమక్షంలో బయటకు తీసి చిన్నారి మృతదేహానికి ఏరియా ఆసుపత్రి వైద్యులు ప్రణతి రెడ్డి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.