సిరిసిల్ల నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు బైక్ ర్యాలీ ధర్నా కార్యక్రమం.
కలెక్టర్ వెంటనే చర్చలు జరిపి డిమాండ్లు పరిష్కరించి సమ్మె విరమింప చేయాలి.
సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ముషం రమేష్ డిమాండ్.
రాజన్న సిరిసిల్ల, ( ప్రజాబలం ), ప్రభుత్వ ఆర్డర్ చీరలకు సంబంధించి పవర్లూమ్ కార్మికులకు వార్పిన్, వై పని కార్మికులకు మెరుగైన వేతనాలు ఇచ్చే విధంగా కూలీ నిర్ణయం తీసుకొని సమస్యలు పరిష్కరించాలని చేనేత కార్మికులు చేపట్టిన సమ్మె రెండవ రోజు సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని బి వై నగర్ లోని సమ్మె శిబిరం నుండి బైక్ ర్యాలీగా కలెక్టరేట్ వరకు చేరుకొని కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఏవో కి వినతిపత్రం అందించడం జరిగింది.
ఈ సందర్భంగా సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులముషం రమేష్, వార్పిన్, వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు సిరిమల సత్యం, వై పని నాయకులు ఒగ్గు గణేష్ మాట్లాడుతూ మనుషుల మానాన్ని కాపాడే వస్త్రం నేసే నేతన్నల పట్ల ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు.
కార్మికుల ఆత్మహత్యల నేపథ్యంలో కార్మికులకు నిరంతరం ఉపాధితో పాటు మెరుగైన వేతనాలు అందిస్తామని చెప్పిన ప్రభుత్వం చీరల ఆర్డర్ వస్త్రం ఉత్పత్తి ప్రారంభమైనప్పటికీ పవర్లూమ్, వార్పిన్, వైపని కార్మికులకు కూలి నిర్ణయించకుండా అన్యాయం చేస్తుంది అన్నారు.
ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని సంబంధిత అధికారులతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించి సమ్మె విరవింపజేయాలని, లేకుంటే సమ్మెను ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు, కోడం రమణ, పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు గుండు రమేష్, వై పని వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కుమ్మరి కుంట కిషన్, నాయకులు ఉడత రవి, సబ్బని చంద్రకాంత్, బాస శ్రీధర్, శ్రీకాంత్, సదానందం, వేణు, తిరుపతి, వెంకటేశ్వర్లు, పోచమల్లు పెద్ద ఎత్తున పవర్లూమ్, వార్పిన్, వై పని కార్మికులు పాల్గొన్నారు.