ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి డిసెంబర్ 23 :
ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేసి త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో మంచిర్యాల,బెల్లంపల్లి రాజస్వ మండల అధికారులు శ్రీనివాసరావు, హరికృష్ణ లతో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. జైపూర్ మండలం వేలాల ఎం. పి. పి.జాడి యేసయ్య వేలాల శివారులో జరుగుతున్న ఇరిగేషన్ వారి ఇసుక క్వారీలో అవకతవకలు నెలకొన్నాయని, ఈ విషయమై సమగ్ర విచారణ జరిపి అధికారులు నిబంధనలు పాటిస్తూ ఇసుక తీసుకునేలా చర్యలు తీసుకోవాలని దరఖాస్తు అందజేశారు.మంచిర్యాల పట్టణంలోని రామ్ నగర్ కు చెందిన బొమ్మ కంటి శ్రీనివాస్ తనకు మంచిర్యాల శివారులో గల భూమికి సంబంధించి ధరణిలో తన పేరును పట్టాదారుగా నమోదు చేసి పట్టా పాస్ పుస్తకం మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.దండేపల్లి మండలం రాజంపేట గ్రామానికి చెందిన జాడి కళ్యాణ్ చక్రవర్తి తమకు లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేట గ్రామ శివారులో తమకు వారసత్వంగా వచ్చిన భూమిని కొందరు అక్రమంగా ఆక్రమించుకొని తప్పుడు పత్రాలు సృష్టించి అసలైన పత్రాలుగా చలామణి చేస్తున్నారని,ఈ విషయమై విచారించి తనకు న్యాయం చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు.తాండూర్ మండలం కాసిపేట గ్రామానికి చెందిన సుంకరి విక్రమ్ తమ తండ్రిగారి పేరిట గల భూమిని గత 50 సంవత్సరాలుగా తమ కుటుంబం సాగు చేసుకుంటూ జీవిస్తుందని,ఇప్పుడు కొంతమంది అక్రమంగా ఇట్టి భూమిని ఆక్రమించుకోవడంతో పాటు తిరిగి మాపై అక్రమ కేసులు నమోదు చేసి వేధిస్తున్నారని,ఈ విషయమై విచారించి తమకు న్యాయం చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. బెల్లంపల్లి పట్టణం ఇందిరమ్మ కాలనీకి చెందిన బి. శ్రీదేవి తనకు ఇల్లు నిర్మించుకునేందుకు ఇందిరమ్మ పథకం కింద సహాయం చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. భీమిని మండలం జగ్గయ్యపేట గ్రామానికి చెందిన పెద్దపల్లి సరస్వతి మండలంలోని వడల్ గ్రామ శివారులో తమ తండ్రి పేరిట గల భూమిని తమకు తెలియకుండా తన సోదరులు విరాసత్ పట్టా చేసుకున్నారని, ఇట్టి పట్టాను రద్దు పరచి తనకు వాటా ఇప్పించి న్యాయం చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారుల సమన్వయంతో కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.