ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ డిసెంబర్ 23 : జల శక్తి అభియాన్ కార్యక్రమం కింద జిల్లాలో చేపట్టిన నీటి సంరక్షణ పనులకు సంబంధించిన వివరాలను శాఖల వారీగా జల్ సంచాయ్ పోర్టల్ లో స్పష్టంగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులు,మున్సిపల్, అటవీ శాఖ అధికారులతో జల శక్తి అభియాన్ కార్యక్రమం కింద చేపట్టిన పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జల శక్తి అభియాన్ క్రింద జల్ సంచాయ్ – జన్ భాగీరధి కార్యక్రమంలో భాగంగా మార్చి 9, 2024 నుండి చేపట్టిన పనులకు సంబంధించి శాఖల వారీగా ప్రభుత్వం వివరాలు సేకరించి,ఇట్టి సమాచారాన్ని ఎలాంటి పొరపాట్లు లేకుండా జల్ సంచాయ్ పోర్టల్ లో స్పష్టంగా నమోదు చేయాలని, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్ సమన్వయకర్తగా వ్యవహరిస్తారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్, అటవీ శాఖల అధికారులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.